దాడులు, విధ్వంసం.. హింసాత్మకంగా చంద్రబాబు పర్యటన : రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు వైసీపీ పిలుపు

Siva Kodati |  
Published : Aug 04, 2023, 08:27 PM IST
దాడులు, విధ్వంసం.. హింసాత్మకంగా చంద్రబాబు పర్యటన : రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు వైసీపీ పిలుపు

సారాంశం

రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది. శుక్రవారం అంగళ్లు, పుంగనూరులలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. 

శుక్రవారం అంగళ్లు, పుంగనూరులలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్భంగా వైసీపీ శ్రేణులపై జరిగిన దాడిపై అధికార పార్టీ భగ్గుమంది . ఈ నేపథ్యంలో రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై స్పందించారు. చంద్రబాబు పిచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన వెనుక వున్నది టీడీపీ నేతలేనని.. వాళ్లే దాడి చేసుకుని మాపై బురద జల్లుతున్నారని సజ్జల ఆరోపించారు.

తాము ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో వున్నామని.. అందుకే టీడీపీ నేతలు తిరగగలుగుతున్నారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అంగళ్లు ఘటనలో యాక్షన్, రియాక్షన్ రెండూ చంద్రబాబుదేనని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేయించి, దీని వెనుకున్న వారిని బయటకు తీసుకొస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు, వైసీపీ నేతలు యత్నించడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీస్ వాహనాలపై దాడులకు దిగిన వారు.. రెండింటికి నిప్పు పెట్టారు. దీంతో టీటీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వారు శాంతించకపోవడంతో భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. 

Also Read: రణరంగంలా పుంగనూరు : రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. రాళ్లు, బీర్ బాటిల్స్‌తో దాడి, పోలీస్ వాహనాలకు నిప్పు

మరోవైపు.. చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లులో జరిగిన విధ్వంసక ఘటనలపై జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే గొడవ చేశారని ఆయన ఆరోపించారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో 2 వేల మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారని రిషాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులపై పక్కాప్లాన్ ప్రకారం దాడి జరిగిందని ఆయన తెలిపారు. వాళ్లు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి వుందని.. కానీ వారు అలా వెళ్లకుండా పుంగనూరులోకి వచ్చారని ఎస్పీ చెప్పారు. దీంతో పుంగనూరులోకి రాకుండా టీడీపీ క్యాడర్‌ను అడ్డుకున్నామని రిషాంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా పోలీసులపై విచక్షణారహితంగా దాడికి దిగారని ఎస్పీ తెలిపారు. 2 పోలీస్ వాహనాలను తగులబెట్టారని.. ఈ ఘటనలో 14 మంది పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. రాళ్లదాడిలో మరో 50 మందికి పైగా గాయాలు అయ్యాయని రిషాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని.. దీని వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టేది లేదని ఎస్పీ తేల్చిచెప్పారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప పోలీసుపై కాదని ఆయన హితవు పలికారు. గొడవ పెట్టుకునేందుకే టీడీపీ కేడర్ ఇక్కడికి వచ్చారని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!