తిరుమల .. రెండు చిరుతలు మ్యాన్ ఈటర్‌గా మారాయి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

By Siva Kodati  |  First Published Aug 19, 2023, 2:47 PM IST

తిరుమల నడకదారిలో చిరుత పులుల సంచారంపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రెండు చిరుతలు మ్యాన్ ఈటర్‌గా మారాయని మంత్రి తెలిపారు. టీటీడీకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 
 


తిరుమల నడకదారిలో చిరుత పులుల సంచారంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్న సంగతి తెలిసిందే. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే చిరుతల నుంచి రక్షించుకునేందుకు గాను కర్రలను కూడా అందజేస్తోంది. మరోవైపు చిరుతల అంశంపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందడం బాధాకరమని..బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించామని పెద్దిరెడ్డి తెలిపారు. 

భక్తులపై చిరుతలు దాడి చేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని.. అయితే రెండు చిరుతలు మ్యాన్ ఈటర్‌గా మారాయని మంత్రి తెలిపారు. వీటిని జూ పార్క్‌లో వుంచుతామని ఆయన పేర్కొన్నారు. నడకమార్గంలో శాశ్వత ప్రాతిపదికన కంచెను ఏర్పాటు చేసేందుకు టీటీడీ, అటవీ శాఖలు యోచిస్తున్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. టీటీడీ పరిధిలో వున్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని.. టీటీడీకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 

Latest Videos

undefined

ALso Read: తిరుమలలో చిరుత కలకలం .. మొదటి ఘాట్ రోడ్‌లో కెమెరాకు చిక్కిన వైనం, రంగంలోకి అధికారులు

మరోవైపు.. తిరుమలగిరుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. భక్తుల సంరక్షణ కోసం టీటీడీ అధికారులు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. భక్తులు నిఘా నీడలో కాలినడక సాగించడం, చిరుతలను బంధించడం , చిరుతల సంచారంపై అధ్యయనం చేయడం వంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వచ్చిన బృందం చిరుతల సంచారంపై అధ్యయనం చేయనుంది. 

ఇకపోతే.. పులుల నుంచి భక్తులు తమను తాము రక్షించుకోవడానికి కొన్ని నిబంధనలు పాటించాలని అధికారులు చెప్పారు. అందులో ఒక నిబంధన కర్రలు పట్టుకుని నడవాలని ఉన్నది. ఈ నిబంధన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది. కేవలం కర్రలతో పులిని బెదిరించి పంపిచేయొచ్చా? కర్రలు పులుల నుంచి భక్తుల ప్రాణాలను కాపాడుతుందా? ఇది సరైన నిర్ణయమేనా? అనే చర్చ మొదలైంది. తాజాగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు అమలాపురంలో గడియారం స్తంభం సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తిరుమత వెంకటేశ్వర స్వామి అందరి ఆరాధ్య దైవం అని చంద్రబాబు అన్నారు. అందుకోసం ఆయన దర్శనానికి తిరుపతి వెళ్లుతామని తెలిపారు. తిరుమలలో పులులు ఉన్నాయని భక్తులకు కర్రలు ఇస్తున్నారని చెప్పారు. ఇంటికో కర్ర తరహా పాత రోజులను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. 
 

click me!