లోపాలున్నాయి.. సరిదిద్దేలోపే కోర్టుకెక్కారు: జీవో నెంబర్ 2 రద్దుపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన

By Siva KodatiFirst Published Jul 12, 2021, 5:35 PM IST
Highlights

పంచాయితీ సర్పంచ్‌లు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. 

టీడీపీ నేతలకు లాట్రైట్‌కు, బాక్సైట్‌కు తేడా తెలియదా అని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జీవో నెంబర్ 2లో కొన్ని లోపాలు వున్నాయని అయితే వాటిని సరిదిద్దుకునేలోపే కొంతమంది కోర్టుకు వెళ్లారని మంత్రి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు గ్రామ స్వరాజ్యంలో భాగమని పెద్దిరెడ్డి అన్నారు. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినవి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. లోపాలు సరిదిద్దుకుని తిరిగి జీవోను జారీ చేస్తామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 

అంతకుముందు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయితీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ జీవో ను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన దాఖలుచేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగిన న్యాయస్థానం జీవోను సస్పెండ్ చేసింది. 

Also Read:జీవో నెంబర్ 2 సస్పెండ్... హైకోర్టులో జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ

పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యంచేసేలా ప్రజలచేత ఎన్నుకోబడిన సర్పంచ్ అధికారాలను రెవెన్యూ పరిధిలోకి బదిలీ చేస్తూ జీవో నెంబర్ 2 తీసుకువచ్చారని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలన్ని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ వివాదాస్పద జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని నిరసనలు కూడా జరిగాయి. 
 

click me!