ఏపీలో ఆ దేవాలయాల పరిస్థితి ఇదీ... మీరే పూనుకోవాలి: కేంద్రమంత్రితో శారదాపీఠం ఉత్తరాధికారి భేటీ (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 12, 2021, 5:04 PM IST
Highlights

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాచీన ఆలయాల పరిస్థితిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర. సోమవారం డిల్లీలోని మంత్రి అధికారిక నివాసానికి వెళ్ళి ఆయనతో చర్చ జరిపారు స్వాత్మానందేంద్ర. 

న్యూడిల్లి: తెలుగురాష్ట్రాల్లో ప్రాచీన ఆలయాల అభివృద్ధికి పురావస్తు శాఖ నిబంధనలు అడ్డుగా వున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసానికి వెళ్ళిన స్వాత్మానందేంద్ర ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తుశాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు.

తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలకు పురావస్తుశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాచీన నిర్మాణాలపై పురావస్తుశాఖ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో... వాటి సంరక్షణ, అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణలో వేయి స్తంభాల గుడి, ఆంధ్రలో పంచారామ క్షేత్రాలు పురావస్తు శాఖ నియమ నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని స్వాత్మానందేంద్ర కేంద్ర మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసారు. 

వీడియో


 
తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ, జానపద కళల పరిరక్షణకు విశేషంగా కృషి చేయాలని కిషన్ రెడ్డికి సూచించారు. విశాఖ శారదాపీఠం ఈనెల 24వ తేదీ నుంచి చేపట్టనున్న చాతుర్మాస్య దీక్ష గురించి మంత్రి వివరించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు కిషన్ రెడ్డి దంపతులకు ఉండాలని స్వాత్మానందేంద్ర ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా ఆదిశంకరాచార్య ప్రతిమను కిషన్ రెడ్డిదంపతులకు బహుకరించి శాలువాతో సత్కరించారు. రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని వారికి అందించారు. తన అధికారిక నివాసానికి విచ్చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతిని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు సత్కరించారు. 

click me!