ఎమ్మెల్యేలను కొనేసి .. గెలిచామని సంబరాలు సంబరాలా : చంద్రబాబుపై మంత్రి కొట్టు ఆగ్రహం

By Siva KodatiFirst Published Mar 26, 2023, 8:53 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు దుర్మార్గమైన బుద్ధిని బయట పెట్టాడని మంత్రి దుయ్యబట్టారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, పారిపోయి వచ్చి అక్రమ బిల్డింగ్ కట్టుకున్నాడని ఆరోపించారు. రూ.పది కోట్లను ఒక ఎమ్మెల్యేకి ఆఫర్ చేసిన చంద్రబాబు.. విజయం సాధించామని సంబరాలు చేసుకున్నారని కొట్టు ఎద్దేవా చేశారు. మరోసారి తన దుర్మార్గమైన బుద్ధిని బయట పెట్టాడని మంత్రి దుయ్యబట్టారు. 

వైసీపీ నేత శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు మరోసారి బ్యాక్‌డోర్ పాలిటిక్స్‌కు తెరలేపాడని ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడి హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చాడని శ్రీరంగనాథ రాజు ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనదన్న ఆయన.. చివరికి ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసే స్థాయికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో వుండగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొని పార్టీని ఇబ్బంది పెట్టాలని చూశారని శ్రీరంగనాథ రాజు ఆరోపించారు. అప్పుడు 23 మంది వెళ్లినా.. నేడు నలుగురు పోయినా జగన్ పట్టించుకోరని ఆయన స్పష్టం చేశారు. 

ALso REad: టీడీపీ టార్గెట్ 10 మంది ఎమ్మెల్యేలు , నాకూ గాలం.. అసెంబ్లీ సీసీ కెమెరా ఫుటేజే ఆధారం : రాపాక మరో సంచలనం

అంతకుముందు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పక్కా ఆధారాలతోనే సస్పెండ్ చేసిందని స్పష్టం చేశారు. జగన్‌ను విభేదించిన వారికి ఓటమి తప్పదని, గతంలో వైసీపీని వీడిన 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుందన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని మనిషిని.. ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్టీఆర్‌ను దించేశారని మిథున్ రెడ్డి ఆరోపించారు. సీటు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారని.. కానీ జగన్ మాత్రం కరాఖండీగా చెప్పేశారని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్‌కు వుందా అని మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. వైనాట్ 175 లక్ష్యంతోనే తాము పనిచేస్తామన్నారు. 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. రాజకీయాలను చంద్రబాబు వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని, మామకు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి నేటి ఎమ్మెల్సీ ఎన్నికల దాకా ఆయన పద్ధతి ఇదేనంటూ మోపిదేవి దుయ్యబట్టారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి జగన్ సీఎం అవుతారని వెంకట రమణ జోస్యం చెప్పారు. 

click me!