పీఏ ద్వారా అవినీతి.. అవసరమైతే జైలుకు పంపుతాం : ఆనం రాంనారాయణ రెడ్డికి నేదురుమల్లి హెచ్చరిక

By Siva KodatiFirst Published Mar 26, 2023, 6:46 PM IST
Highlights

తవ్వేకొద్దీ ఆనం రాంనారాయణ రెడ్డి అక్రమాలు బయటపడుతున్నాయని ఆరోపించారు వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. వీటిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆయనను జైలుకు పంపుతామని నేదురుమల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ క్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై విమర్శలు గుప్పించారు..  వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే అధిష్టానం ఆయనను తప్పించిందన్నారు. తనను రాజ్యాంగేతర శక్తి అనడం సరికాదని.. ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని నేదురుమల్లి పేర్కొన్నారు. జగన్ వల్లే ఆనంకు వెంకటగిరిలో అన్ని వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని రాంకుమార్ రెడ్డి గుర్తుచేశారు. 

మంత్రి పదవి ఇవ్వలేదనే రాంనారాయణ రెడ్డికి బాధగా వుందని.. అధిష్టానం పిలిచి మాట్లాడినా అదే తీరు కొనసాగించారని నేదురుమల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్ధితుల్లో తనను సమన్వయకర్తగా నియమించారని.. గతంలో టీడీపీలో ఇన్‌ఛార్జ్‌గా వుంటూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని నేదురుమల్లి దుయ్యబట్టారు. సజ్జల విలేకరిగా పనిచేసినప్పటికీ.. ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. మరి ఆనం ఏం చేసి ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించారని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ప్రశ్నించారు. పీఏ ద్వారా ఆనం అక్రమాలకు పాల్పడ్డారని.. వీటిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు పంపుతామని నేదురుమల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై ఆనం రాంనారాయణ రెడ్డికి క్లారిటీ లేదన్నారు. తవ్వేకొద్ది ఆనం అవినీతి బయటపడుతోందని.. దీనిపై సీఎంకు చెప్పి కమిటీ వేస్తామని నేదురుమల్లి స్పష్టం చేశారు. 
 

click me!