ఆదోనీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఎమ్మెల్యే చెప్పింది ఒకటైతే టీడీపీ కలిపించి చెబుతోంది మరోకటని ఆయన అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో మాఫియా, మైనింగ్ దోపిడీ జరిగిందని ఆరోపించారు. చినబాబు, పెదబాబుకి వాటాలు వెళ్లేవని అప్పట్లో ఎమ్మెల్యేలే చెప్పేవారని.. ఇప్పుడు ఇసుకపై ఏడాదికి ఏడు, ఎనిమిది వందల కోట్ల ఆదాయం వస్తోందని మంత్రి తెలిపారు. ఇక పవన్ తొలుత ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కొట్టు సత్యనారాయణ చురకలంటించారు. రాష్ట్రంలో జగన్‌ను కదిలించే పరిస్ధితి లేదని.. ఆయనే మరోసాని ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనేసి ఒక్క ఎమ్మెల్సీ గెలిచి దానికే ట్రైలర్ అంటూ టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీకి దమ్ముంటే వున్న 19 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని ఆయన సవాల్ విసిరారు.
ఇక ఆదోనీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కొట్టు సత్యనారాయణ స్పందించారు. జగన్ ఎంతో సమర్దవంతంగా పనిచేస్తున్నారని.. మరో అవకాశం ఇస్తే మరింత అనుభవం వస్తుందనే ఆయన అన్నారని మంత్రి తెలిపారు. ఆయన చెప్పిన దానిని ముక్కలు ముక్కలు చేసి కలిపించి చెప్పారని కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 25న శ్రీశైలంలో జరిగే కుంభాభిషేకానికి జగన్ వస్తారని మంత్రి తెలిపారు.
Also Read: వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నిజమే.. జగన్‌కు అనుభవం లేదు : ఆదోనీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కాగా.. తమతో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. దీనిని వైసీపీ నేతలు ఖండిస్తున్నా.. ఎక్కడో తెలియని భయం వారిని వెంటాడుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో పాటు అంతకుముందు నుంచే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనీ వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. నాయకులతో ఎలా వుండాలన్న దానిపై జగన్ అనుభవం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రెండోసారి సీఎంగా అవకాశమిస్తే జగన్‌కు పూర్తి అవగాహన వస్తుందని సాయిప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతతం ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.