వాకపల్లి అత్యాచారం కేసులో 21 మంది పోలీసులు నిర్దోషులే.. తీర్పుపై బాధితుల అసంతృప్తి!.. 2007లో ఏం జరిగింది?

By Sumanth KanukulaFirst Published Apr 9, 2023, 1:18 PM IST
Highlights

వాకపల్లిలో 11 మంది గిరిజిన మహిళలపై సామూహిక అత్యాచారం కేసులో 21 మంది పోలీసులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే తీర్పును బాధిత మహిళలు పాక్షికంగానే స్వాగతిస్తున్నారు. వ్యవస్థ శక్తిమంతులనే రక్షిస్తుందని వారు అంటున్నారు.
 

విశాఖపట్నం: వాకపల్లిలో 11 మంది గిరిజిన మహిళలపై సామూహిక అత్యాచారం కేసులో 21 మంది పోలీసులను కోర్టు నిర్దోషులుగా  ప్రకటించింది. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలో ఇద్దరు విచారణ అధికారులు విఫలమైనందున నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టుగా విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు గురువారం పేర్కొంది. బాధితులకు నష్టపరిహారం విశాఖపట్నం జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విచారణాధికారి శివానందరెడ్డి విచారణ సరిగా చేయనందున శాఖపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. 

అయితే తీర్పును బాధిత మహిళలు పాక్షికంగానే స్వాగతిస్తున్నారు. వ్యవస్థ శక్తిమంతులనే రక్షిస్తుందని వారు అంటున్నారు. ఒక పోలీసు మరొక పోలీసు చేసిన నేరాన్ని నిష్పాక్షికంగా విచారించడని వారు చెబుతున్నారు. తమకు న్యాయం దూరమైందని  వాపోతున్నారు. తమకు నష్టపరిహారం అందించాలని కోర్టు ఆదేశించడం మాత్రమే కొంత ఊరట కలిగించే అంశమని.. తాము బాధితులమని నమ్ముతున్నారని పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే.. 
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వాకపల్లికి 21 మంది సభ్యులతో కూడిన గ్రేహౌండ్స్ ప్రత్యేక పోలీసు బృందం 2007 ఆగస్టు 20న కుబింగ్ ఆపరేషన్‌కు వెళ్లింది. అయితే వారు తమపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా 11 మంది గిరిజన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. అయితే ఈ కేసు విచారణను ప్రభుత్వం నీరుగార్చిందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలను గమనిస్తే.. 
ఈ కేసుకు సంబంధించి 2007 ఆగస్టు 26 వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. నేరారోపణ జరిగిన ప్రదేశాన్ని భద్రపరచడానికి లేదా వారి వాంగ్మూలాలను నమోదు చేయడానికి ఏ పోలీసు కూడా వాకపల్లిని సందర్శించలేదు. 2007 ఆగస్టు 27న రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి విశాఖపట్నం రూరల్ పోలీస్ డిప్యూటీ ఎస్పీ బి ఆనందరావును నియమించింది. సెప్టెంబరు 8 వరకు ఆయన వాకపల్లి వెళ్లలేదని.. నేరం జరిగిన ప్రదేశంలో భద్రత లేదని, 17 రోజుల వరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేదని కోర్టు పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత పాడేరు పోలీసులు మహిళలను వైద్య పరీక్షలకు పంపేందుకు మరో రెండు రోజులు ఆలస్యం చేశారు. అత్యాచారం కేసుల పరిశీలనకు అర్హత లేని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి మహిళలను తీసుకెళ్లేందుకు పోలీసులు తొలుత ప్రయత్నించారు. మహిళా సంఘాల మద్దతుతో.. మహిళలు ఆ ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించారు. దీంతో ఆ తర్వాత వారిని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.

12 ఏళ్లుగా నిందితులకు ఎలాంటి గుర్తింపు పరీక్ష నిర్వహించలేదని కోర్టు పేర్కొంది. చివరకు ఫిబ్రవరి 2019లో విచారణ ప్రారంభమై.. గుర్తింపు పరీక్షకు కోర్టు ఆదేశించినప్పుడు.. 12 ఏళ్ల తర్వాత పురుషులను ఎలా గుర్తించాలని మహిళలు అడిగారు.

గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లిన సమయంలో పోలీసు స్టేషన్‌లోని డ్యూటీ రిజిస్టర్, ఆర్మరీ డైరీని మొదటి విచారణ అధికారి బి ఆనందరావు సేకరించి భద్రపరచలేదు. విచారణ పూర్తి కాకముందే ఆనందరావు మరణించారు. 2014 అక్టోబర్‌లో విశాఖను హుద్‌హుద్ తుపాను తాకిన సమయంలో పత్రాలు మాయమైనట్లు రెండో దర్యాప్తు అధికారి ఎం శివానందరెడ్డి నివేదిక సమర్పించారు.

ఇదిలా ఉంటే.. గిరిజన మహిళల  ఆరోపణలను  నిందితుల తరఫు న్యాయవాదులు ఖండించారు. దీనిని మావోయిస్టుల కుట్ర అని ఆరోపించారు. పోలీసు సిబ్బందిని ఇరికించడానికి, తదుపరి కూంబింగ్ కార్యకలాపాలను నిరోధించడానికే మహిళల చేత మావోయిస్ట్‌లు ఆరోపణలు చేయించారని అన్నారు.

ఇక, ఈ కేసులో కోర్టు తీర్పుపై హెచ్‌ఆర్‌ఎఫ్-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ స్పందిస్తూ.. వాకపల్లి అత్యాచార బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందంటే, వారి వాదనలపై కోర్టు విశ్వాసం ఉంచిందనేది అర్థం అవుతుందని పేర్కొంది. నిందితులైన పోలీసులపై విచారణ ప్రారంభంలోనే రాజీ పడిందని ఆరోపించింది. ఫోరెన్సిక్ వైద్య పరీక్షలను విఫలమైనప్పుడు.. క్రిమినల్ కోడ్ తప్పనిసరి చేసిన విధానాలను విస్మరించి, వారిని రక్షించాలనే ఉద్దేశ్యంతో విచారణ జరిగిందని తెలిపింది. 

click me!