
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మరో ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చే యోచనలో వున్నారు మంత్రి కొడాలి నాని. షోకాజ్ నోటీస్‌కు వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆంక్షలు విధించడం, క్రిమినల్ కేసు పెట్టాలని ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై విచారించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. ఇవాళ, లేదా రేపు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చే అవకాశం వుంది.
కాగా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read:మంత్రి కొడాలి నానికి షాక్: క్రిమినల్ కేసు నమోదుకు నిమ్మగడ్డ ఆదేశాలు
ఎన్నికల కోడ్ నిబంధనల్లోని క్లాజ్-1, క్లాజ్-4 కింద కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, కమిషనర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందున చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేశారు.
చంద్రబాబు చెప్పినట్లు ఎస్ఈసీ నడుస్తున్నారని.. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబును, నిమ్మగడ్డను పిచ్చాసుపత్రికి పంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.