
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలకు పంగనామాలు పెట్టారని.. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. పేదలకు జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుంటే చంద్రబాబు అడ్డుకునేందుకు యత్నించారని కారుమూరి ఆరోపించారు. ప్రధాని మోడీతో మరోసారి జట్టుకట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.
ఇకపోతే.. చంద్రబాబు నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారని కొనియాడారు. మోడీ వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్ ను గుర్తిస్తుందన్నారు. ఎన్డీఏ అభివృద్ది విధానాలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. అయితే ప్రత్యేక హోదా సెంటిమెంట్ వల్లే ఎన్డీఏ నుండి బయటకు వచ్చామన్నారు. మోడీ అభివృద్ది విధానాలతో ఏకీభవిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
పబ్లిక్, పీపుల్,ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ అన్నది కొత్త విధానమని ఆయన గుర్తుచేశారు. టెక్నాలజీతో పేదరికాన్ని రూపుమాపవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఫిన్ టెక్ దేశంలో కొత్త విప్లవాన్ని తెచ్చిందని చంద్రబాబు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ డెమోగ్రాపిక్ డివిడెండ్ దేశాన్ని నడిపిస్తాయన్నారు. మోడీ విధానాలను ఇంకా మెరుగుపెడితే 2050 నాటికి ప్రపంచంలో భారత్ దే అగ్రస్థానమని ఆయన అభిప్రాయపడ్డారు. రూ. 500 కంటే పెద్దనోట్లన్నీ రద్దు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
కాగా.. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అయితే 2019 ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబునాయుడు ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. మోడీ సర్కార్ పై అవిశ్వాసం కూడా ప్రతిపాదించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. కానీ 2019 ఎన్నికల్లో మోడీ రెండోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయలేదు. కానీ మోడీపై చంద్రబాబు ఇలా పొగడ్తలు కురిపించడం 2019 ఎన్నికల తర్వాత బహుశా ఇదే ప్రథమంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.