
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినియోగదారుల హక్కుల చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్తీ వస్తువులు, సమస్యలపై పరిష్కారానికి కొత్త మార్పులు దోహదపడతాయని కారుమూరి అభిప్రాయపడ్డారు. వినియోగదారుల సమస్యలపై ఇకపై గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చేయొచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం 1967, 1800 425 0082 టోల్‌ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కారుమూరి తెలిపారు.
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి విమర్శలు గుప్పించారు. ఆయన తీవ్ర అసహనంతో మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసి అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నారని... ప్రజలు జగన్‌ను తమ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారని మంత్రి అన్నారు. దేశంలో అక్షరాస్యత విషయంలో కేరళ తొలి స్థానంలో వుంటే.. ఏపీ రెండో స్థానంలో వుందన్నారు.
ALso REad:చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్:జనసేనానిపై ఏపీ మంత్రి కారుమూరి ఫైర్
అంతకుముందు సీఎం జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు పాలన చేతకాదని, అందుకే బై, బై అంటూ ప్రజలు ఆయనను ఇంటికి పంపారని సెటైర్లు వేశారు. తనకు తానే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఒప్పుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. పులివెందులపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు భూమి ఇచ్చిన వారిలో ఎవరి ఇల్లు కూలిందో పేర్లు ఇవ్వమంటే పవన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని సజ్జల నిలదీశారు. వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్ ఇద్దరూ మంచి నాయకులేనని రామకృష్ణారెడ్డి అన్నారు. కింది స్థాయిలో అపోహలు వుంటే తొలగించుకోవాలని సూచించానని ఆయన తెలిపారు.