నీతిగా ఉన్నందున తాను నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై సీబీఐ విచారణను స్వాగతించినట్టుగా ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు మాదిరిగా తాను స్టేలు తెచ్చుకోలేదన్నారు.
అమరావతి:నెల్లూరు కోర్టులో చోరీపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు కోర్టులో చోరీని సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇవాళ ఉదయం ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు.నీతిగా ఉన్నందున సీబీఐ విచారణ కోరుతున్నట్టుగా చెప్పారు. దమ్ముంటే తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్దం కావాలని టీడీపీ చీఫ్ చంద్రబాబును కోరారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు మాదిరిగా కోర్టుకు వెళ్లి తాను స్టే తెచ్చుకోలేదన్నారు.
also read:నెల్లూరు కోర్టులో చోరీ కేసు... మంత్రి కాకానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి : టీడీపీ నేత సోమిరెడ్డి
టీడీపీ నేత ,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ విషయమై తన వద్ద ఆధారాలున్నాయన్నారు. ఈ పత్రాలను కూడా ఆయన విడుదల చేశారు. అయితే ఈ విషయమై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ నిర్వహించిన పోలీసులు ఈ పత్రాలు ఫోర్జరీవిగా తేల్చారు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లను నెల్లూరు కోర్టులో భద్రపర్చారు . అయితే నెల్లూరులోని నాలుగో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో భద్రపర్చిన ఈ పత్రాలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పత్రాలను చోరీ చేసేందుకు నిందితుడు రాలేదని పోలీసులు తేల్చారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కోర్టులో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఇలాంటి నేరాలు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని మంత్రివర్గం నుండి తప్పించాలని ఆయన కోరారు.