
నెల్లూరులో (nellore) మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (kakani govardhan reddy) , మాజీ మంత్రి అనిల్ కుమార్ (anil kumar yadav) పోటాపోటీగా సభలు పెట్టడంతో సింహపురి రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. అనిల్ కుమార్ యాదవ్ సభను పోటీ కార్యక్రమంగా భావించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకుని వెళ్తానని కాకాణి చెప్పారు. అనిల్ కుమార్ కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి తొలిసారిగా ఇవాళ నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. దీంతో కాకాణి వర్గీయులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలతో పాటు సభను ఏర్పాటు చేశారు. అయితే ఇవాళే మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా నెల్లూరు గాంధీ సెంటర్ లో సభను ఏర్పాటు చేశారు. ఒకే రోజున నెల్లూరు పట్టణంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సభలు ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది.
జగన్ గత మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుండి అనిల్ కుమార్, మేకపాటి గౌతం రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. అనారోగ్యంతో ఇటీవలనే మేకపాటి గౌతం రెడ్డి మరణించారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి YS Jagan చోటు చకల్పించారు. నెల్లూరు జిల్లా నుండి అనిల్ కుమార్ మంత్రివర్గంలో చోటును కోల్పోయారు.
అనిల్ కుమార్ గత టర్మ్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి తనకు సరిగా సహకరించలేదని అనిల్ .. సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీటి పారుదల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ పై కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు చేశారు. ఈ పరిణామాలను సీఎం జగన్ దృష్టికి అనిల్ కుమార్ తీసుకెళ్లారు. దీంతో జగన్ వారిని పిలిపించి మాట్లాడారని సమాచారం.
ఈ నెల 11న కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అనిల్ కుమార్ హాజరు కాలేదు. తనకు కాకాణి గోవర్ధన్ రెడ్డి నుండి ఆహ్వానం అందని కారణంగానే తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆయన చెప్పారు. గతంలో తనకు ఏ మేరకు కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకరించారో అంతకు రెట్టింపు స్థాయిలో సహకరిస్తానని కూడా ఆయన చెప్పారు. ఆ మరుసటి రోజే నెల్లూరు పట్టణంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతం తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయితే దీని వెనుక మాజీ మంత్రి అనిల్ కుమార్ వర్గీయులే కారణమని కాకాణి గోవర్ధన్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరో వైపు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో గత వారంలో అనిల్ కుమార్ భేటీ అయ్యారు. ఆ భేటీ ముగిసిన మరునాడే Kotamreddy Sridhar Reddy తో భేటీ అయ్యారు అనిల్ కుమార్. కాకాణి గోవర్ధన్ రెడ్డి వైరి వర్గంతో అనిల్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత చోటు చేసుకొంది.