
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్టు శుభవార్త చెప్పింది. భక్తులను మే 1 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ ప్రకటించారు. గతేడాది కురిసి భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వరద ప్రభావంతో శ్రీవారి మెట్టు మార్గం పెద్దపెద్ద బండరాళ్లు, గుండులు, మట్టిపెళ్లలు, కొండచరియలతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. దీంతో శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసేసి.. మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఆ మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. ఇక, ఈ రోజు శ్రీవారి మెట్టు మార్గంలో జరుగుతున్న పనులను అశోక్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మరమ్మతుల పనులు పూర్తి చేసినట్లుగా చెప్పారు. మే 1వ తేదీ నుంచి భక్తులను ఈ మార్గంలో అనుమతించనున్నట్టుగా చెప్పారు. కోవిడ్ ప్రభావం తగ్గడంతో గత కొద్ది రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాలినడకన తిరుమలకు చేరుకోవాలనే భక్తులకు ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో శ్రీవారిమెట్టు మార్గం అందుబాటులోకి రానుండటం భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.
ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుసగా సెలవులు రావడంతో కొండపై రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్ల జారీని నిలిపివేశామని.. కొండపై కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి, పాలు, తాగునీరు అందిస్తున్నామని వారు తెలిపారు.
ఇక, శనివారం తిరుమల శ్రీవారిని 76,746 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,574 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ.4.62 కోట్లు ఆదాయం వచ్చింది.