హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి : ఇలాంటి పాలన మీకే సొంతం.. జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

Siva Kodati |  
Published : Apr 17, 2022, 03:58 PM IST
హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి : ఇలాంటి పాలన మీకే సొంతం.. జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

సారాంశం

కర్నూలు జిల్లా హోలగుందలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైరయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. 

కర్నూలు జిల్లాలో (kurnool disrtict) హనుమాన్ శోభాయాత్రలో (hanuman shobha yatra 2022) హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ (bjp)  అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) తీవ్రంగా స్పందించారు. కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి జరిగితే మీకు చలనం లేదా? అంటూ జగన్‌పై (cm ys jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు.

"ప్రజలకు రక్షణ కల్పించలేని వాడు సమర్థవంతమైన పాలకుడు ఎలా అవుతాడు? మీ అసమర్థత కారణంగా ఇంకెంతమంది హిందువులు రక్తం చిందించాలి?" అంటూ నిలదీశారు. ప్రతిపక్షాలను గృహనిర్బంధాల ద్వారా కట్టడి చేయడంలో అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న పోలీసులు పౌరుల రక్షణను గాలికొదిలేసే పాలన మీకు మాత్రమే సొంతం జగన్ గారూ అంటూ సోము వీర్రాజు విమర్శించారు. పరిస్థితులను కట్టడి చేసే సామర్థ్యం మీకు లేకపోగా, ప్రశ్నించే తమపై మత రాజకీయ ముద్ర వేయడం ఎంతవరకు ఆమోదయోగ్యం అని ప్రశ్నించారు. 

ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రను వీడి శోభాయాత్రపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, తదుపరి పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమకు ప్రభుత్వం అండ ఉందనే భావనతో కొన్ని వర్గాల వికృత చేష్టలకు అమాయక హిందువులు బలైపోతున్నారని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 

"అధికార పార్టీ ఎమ్మెల్యేలే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్ విషయంలోనూ, శ్రీశైలంలో దేవస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం నుంచి హిందువులు ఇంతకంటే ఇంకేం ఆశించగలరు? జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో నేను పర్యటిస్తా. ప్రజాక్షేత్రంలో మీ నిరంకుశ వైఖరిని ఎండగడతా" అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. 

కాగా.. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం కర్నూలు జిల్లా హోలగుందలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించిన సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణ చోటుచేసుకున్న సమయంలో అక్కడి పరిమిత సంఖ్యలో మాత్రమే పోలీసులు ఉన్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు.. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఓ వర్గానికి చెందిన వారు పోలీసు స్టేషన్‌‌ను ముట్టడించి నినాదాలు చేశారు. ఇదే సమయంలో వర్షం కురవడంతో వారు ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు ఈ క్రమంలోనే డీఎస్పీలు వినోద్‌‌కుమార్ హోలగుందకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్