
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోలికి వచ్చే పెత్తందార్ల సంగతి తేలుస్తామని హెచ్చరించారు మంత్రి జోగి రమేష్. కృష్ణా జిల్లా పామర్రులో 4వ విడత అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు చూసిన జగన్ .. సీఎం అయ్యాక వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. రోడ్ల మీద తిరిగే చంద్రబాబు , లోకేష్, పవన్‌లు జగన్‌ను ఓడిస్తామని పిచ్చి వాగుడు వాగుతున్నారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
14 ఏళ్లు సీఎంగా పనిచేసినా ప్రజల కష్టాలను చంద్రబాబు పరిష్కరించలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. 20 ఏళ్ల పాటు జగన్ సీఎంగా వుండటం శిలా శాసనమని.. గత ప్రభుత్వాలు త్రీడీ, రాజమౌళి సెట్టింగ్‌లకే పరిమితమయ్యాయని జోగి రమేష్ విమర్శించారు. పెత్తందార్ల పిల్లలు విదేశాలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకోవచ్చు కానీ, పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా అని రమేష్ ప్రశ్నించారు. పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ..విద్యా వ్యవస్థలో జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. కార్పోరేట్ విద్యా వ్యవస్థను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను తయారు చేశారని ప్రశంసించారు.
Also Read: టీడీపీ అంటే తినుకో..దండుకో..పంచుకో: చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్
అంతకుముందు కురుపాంలో జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అంటే తినుకో, దండుకో, పంచుకో అని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కారన్నారు. ఎన్నికలయ్యాక ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని జగన్ ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం సమాజాన్ని చీల్చుతుందన్నారు.రాష్ట్రంలో మంచి చేస్తున్నందుకుగాను దుష్టచతుష్టయం తమ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని సీఎం జగన్ చెప్పారు. నమ్మించి ప్రజలను నట్టేట ముంచటమే వారికి తెలిపిన ఏకైక నీతి అని ఆయన వ్యాఖ్యానించారు.