ఆలయ ఆవరణలో కొబ్బరికాయ కొట్టాలంటే చేతిలో రూ.20 పెట్టాల్సిందేనని అక్కడి సిబ్బంది చెబుతున్న వీడియో వైరల్ కాావడంతో విజయవాడ కనకదుర్గ ఆలయంలో వివాదానికి కారణమైంది.
విజయవాడ ఇంద్రకీలాద్రీపై కొలువైయున్నకనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవలి కాలంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆలయ ఆవరణలో కొబ్బరికాయ కొట్టాలంటే చేతిలో రూ.20 పెట్టాల్సిందేనని అక్కడి సిబ్బంది చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలకు టెండర్ పాడుకున్నట్లుగా సమాచారం. దీంతో ఆ డబ్బును దండుకునేందుకు భక్తుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొబ్బరి కాయ ధర రూ.25 నుంచి రూ.30 వుంటే.. టెంకాయ కొట్టేందుకు రూ.20 వసూలు చేస్తారా అని భక్తులు మండిపడుతున్నారు. గతంలో హుండీల లెక్కింపు సమయంలో దొంగతనానికి పాల్పడిన పుల్లయ్య అనే వ్యక్తి అల్లుడికి కొబ్బరికాయల కాంట్రాక్టర్ బినామీ అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా భక్తులపై కొబ్బరికాయ కొట్టాలంటే డబ్బులు ఇవ్వాలంటూ సిబ్బంది గదమాయిస్తుండటం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.