త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే.. అసెంబ్లీలో మంత్రి జోగి రమేష్..

By Sumanth KanukulaFirst Published Sep 15, 2022, 10:16 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. శాసనసభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంపై మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు రాజకీయ నిరుద్యోగులు మారారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. సభలో చర్చకు పట్టుబట్టింది.  ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులు సభలో ఆందోళకు దిగారు. టీడీపీ ఆందోళనల మధ్యనే.. స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వైపు కదిలారు. నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు, అధికార వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు రాజకీయ నిరుద్యోగులు మారారని మండిపడ్డారు. సభలో చాలా విషయాలపై చర్చ జరగాల్సి ఉందని.. చర్చించే దమ్ము లేదు  కాబట్టే గొడవ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ సభ్యులు చర్చకు రాకుండా.. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి గొడవ చేస్తూ చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పోయిందని.. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రేనని విమర్శించారు. 

Also Read: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బుగ్గన

ఇక, టీడీపీ సభ్యుల తీరును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు కావాలనే రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల ప్రశ్నలు కూడా ఉన్నాయని అన్నారు. కరోనా సమయంలో సమావేశాలు జరిగినప్పుడు ప్రశ్నోత్తరాలు పెట్టమని గొడవ చేసిన టీడీపీ.. ఇప్పుడు వద్దంటోందని మండిపడ్డారు. సభలోకి ఫ్లకార్డులు తీసుకురావడంతో సరికాదని అన్నారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. 

వైసీపీ ప్రభుత్వం 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాలు చేశారని.. ఇప్పుడు సమావేశాలను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభ సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాలతో సభను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించడం టీడీపీ ఇష్టం లేదని అన్నారు. 

click me!