
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి జోగి రమేశ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమన్నారు. రాజధానిలో వుండటానికి పేదలు పనికిరారా.. వారు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికి వస్తారా అంటూ జోగి రమేశ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనం చంద్రబాబును, టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని మంత్రి జోస్యం చెప్పారు. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ సైతం సమర్ధించిందని జోగి రమేశ్ గుర్తుచేశారు.
ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 30 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు తాము ఇళ్లను కూడా నిర్మించి ఇస్తున్నామని జోగి రమేశ్ తెలిపారు. 17005 జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా వున్న సమయంలో ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని జోగి రమేశ్ దుయ్యబట్టారు. గతంలో మురికివాడల్లో ఎవరు జీవిస్తారని వ్యాఖ్యానించారని, ఎస్సీలలో ఎవరు పుట్టాలని అనుకుంటారని అన్నారని.. పేదలను చూస్తే చంద్రబాబుకు ఇంత అహంకారమా అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read: పవన్ కల్యాణ్.. నువ్వు ఎన్టీఆర్ కాదు, ఎంజీఆర్ కాదు : జగన్ పై ట్వీట్ కు వర్మ స్టైల్ సెటైర్...
అమరావతిలో పేదలు వుండొద్దా అని ఆయన నిలదీశారు. పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షాలన నిలబడ్డ సీఎం జగన్‌ను సుప్రీంకోర్టు సమర్ధించిందన్నారు. టీడీపీని మరోసారి నిలువునా పాతిపెట్టడం ఖాయమని జోగి రమేశ్ జోస్యం చెప్పారు. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని.. అందుకే పొత్తుల కోసం తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు. ఇక పవన్ కల్యాణ్ ఏకంగా తాను సీఎం అభ్యర్ధిని కాదని.. పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని అంటున్నారని జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు ఎవరు గెలిచినట్లు అని ఆయన విమర్శలు గుప్పించారు.