
గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా చంద్రబాబు డబ్బును లూటీ చేశారో , ఏ రకంగా ప్రజాధనాన్ని దోచుకున్నారో కథనాలు వస్తున్నాయన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. శుక్రవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపైనా చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజన ప్రజల అయిష్టంగానే జరిగిందని.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారని గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన నాయకుడు , అవినీతికి పాల్పడ్డారని అమర్‌నాథ్ ఆరోపించారు. సంక్షోభంలో అవకాశాలు వెతుకుతానని చంద్రబాబు చెబుతూ వుంటారని.. అయితే ఆ సమయంలోనే ఆయన ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ఉపయోగించుకున్నారని చెప్పారు.
ప్రాజెక్ట్‌ల నిర్మాణం విషయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపైనా అవినీతి ఆరోపణలు వచ్చినట్లు ఆయన తెలిపారు. సచివాలయం, కోర్టు నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు ప్రజధనం దోపిడీపై వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు దోపిడీని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం వుందన్నారు. ఆయన హయాంలో 2 వేల కోట్ల అవినీతి జరిగిందని.. చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ రిపోర్ట్ ఇచ్చిందని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. కొన్ని ఆధారాలు సేకరించినట్లు కూడా ఐటీ శాఖ తెలిపిందని.. ఏపీ సచివాలయ నిర్మాణంలోనూ భారీ అవినీతి చోటు చేసుకుందని అమర్‌నాథ్ ఆరోపించారు.
ALso REad: దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా,బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం
బాబు అవినీతిపై నేషనల్ మీడియాలోనూ కథనాలు వచ్చాయని.. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల నుంచి , చంద్రబాబు దోపిడీ ప్రజలకు తెలియాలన్నారు. మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారని.. మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి అని గుడివాడ పేర్కొన్నారు. పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను ఫాలో కమ్మని ఆయనకు బాబు చెప్పారని మంత్రి ఆరోపించారు. బోగస్ ఇన్వాయిసులతో నిధులు మళ్లించారని.. ఆర్‌వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లించినట్లు గుడివాడ తెలిపారు.
చంద్రబాబు, టీడీపీకి రూ.143 కోట్లు అందాయని ఆయన ఆరోపించారు. రూ.వంద కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాలని మనోజ్‌ను చంద్రబాబు పీఏ కోరారని.. వివిధ సంస్థలకు సబ్ కాంట్రాక్ట్‌లు ఇచ్చి నిధులు మళ్లించారని గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.372 కోట్లు చంద్రబాబు కొట్టేశారని మంత్రి పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదానికి, ఎంవోయూకు సంబంధం వుండదని అమర్‌నాథ్ దుయ్యబట్టారు. అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంతని మంత్రి సెటైర్లు వేశారు. దోచుకోవడానికి చంద్రబాబు అలవాటు పడ్డారని ఎద్దేవా చేశారు.