ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా మ్యాచ్‌తో పోల్చిన మంత్రి అమర్‌నాథ్.. ఆయన ఏమన్నారంటే..?

By Sumanth KanukulaFirst Published Mar 21, 2023, 2:55 PM IST
Highlights

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ టీడీపీ హయాంలోనే  జరిగిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్స్ స్థాపించి స్కామ్‌కు శ్రీకారం చుట్టారని ఆరోపించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ టీడీపీ హయాంలోనే  జరిగిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్స్ స్థాపించి స్కామ్‌కు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. చంద్రబాబు  నాయుడు స్కామ్ నైపుణ్యతకు ఇది ఒక ఉదాహరణ అని విమర్శించారు. ఒక్క ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులు ఎందుకు కేటాయిస్తుందనే అనుమానం ఎవరికైనా వస్తుందని అన్నారు. యూరో లాటరీల మాదిరిగా టీడీపీ హయాంలో షెల్ కంపెనీలతో కలిసి సింగపూర్ కేంద్రంగా స్కామ్ జరిగిందని చెప్పారు. సీమెన్స్ సంస్థకు లేఖ రాస్తే అంత తక్కువ పెట్టుబడికి.. అంత ఎక్కువ ఎలా పెడతామని సమాధానమిచ్చారని తెలిపారు. 

టీడీపీ హయాంలో డిజైన్ టెక్ కంపెనీకి రూ. 185 కోట్ల సింగిల్ ట్రాన్స్‌ఫర్ జరిగిందని చెప్పారు. అక్కడి నుంచి షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్నారు. సింగపూర్‌కు వెళ్లిన డబ్బులు టోకెన్ల రూపంలో హైదరాబాద్‌కు రావడం ఏమిటని ప్రశ్నించారు.అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిధులు మంజూరు చేస్తున్నట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా జీవో విడుదల చేశారు. 

అప్పటి ఏలేరు స్కామ్‌లో చంద్రబాబు పాత్ర అందరికీ తెలుసునని మంత్రి అన్నారు. స్టాంప్‌ల కుంభకోణంలో చంద్రబాబు హస్తం బయటపడిందని చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ దేశంలోనే అతి పెద్దదని.. ఇందులో చంద్రబాబు, లోకేష్‌ అరెస్ట్ కావాల్సి ఉందని అన్నారు. దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే మరిన్ని విషయాలు  బయటపడతాయని చెప్పారు. చంద్రబాబుకు అవినీతిలో నోబుల్, మోసం చేయడంలో ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మంత్రి అమర్‌నాథ్.. ఒక సెక్టార్‌కు తాము ఎందుకు చేరువకాలేకపోయామనే దానిపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఆ సెక్టార్‌ను ఎందుకు ఆనందపరచలేకపోయామని సమీక్షించుకుంటామని చెప్పారు. దానిని ఓవర్ కమ్ చేసుకుని ముందుకు సాగుతామని తెలిపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్ - కెన్యా మ్యాచ్‌తో పోల్చారు. ఇండియా-కెన్యాల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే.. ఒక్కసారి కెన్యా గెలిచినంతా మాత్రాన భారత్ బలహీనపడినట్టు కాదు కదా అని అన్నారు. ఆరోజు ఏదో ఒక కారణం వల్ల కెన్యా గెలిచి ఉంటుందని.. ప్రతి సారి కెన్యా గెలవదు కదా అని అన్నారు. 2019 నుంచి టీడీపీ గెలుపును చూడలేదని విమర్శించారు. గెలుపుచూడని వాళ్లు ఒక్క గెలుపు చూసి పొంగిపోడం సాధరణమేనని  అన్నారు. సాధారణ ఎన్నికల్లో అసలైన ప్రజాతీర్పు చూస్తారని.. గత అసెంబ్లీ  ఎన్నికల నాటి చరిత్రే మళ్లీ రిపీట్ అవుతుందని తెలిపారు. 

విశాఖ నుంచి పాలిస్తానని సీఎం స్వయంగా చెప్పారని మంత్రి అమర్‌నాథ్ గుర్తుచేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన మంత్రి.. విశాఖ నుంచి పాలన ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానికి డేట్ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. 2023 అకాడమీ ఈయర్ నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలన ప్రారంభమవుతుందనేది తన స్టేట్‌మెంట్ అని చెప్పారు. 

click me!