పాదయాత్రపై అమరావతి రైతుల పిటిషన్.. విచారణ ముగిసే వరకు హైకోర్టులోనే మంత్రి అమర్‌నాథ్

By Siva KodatiFirst Published Oct 27, 2022, 9:58 PM IST
Highlights

అమరావతి రైతులు తమ పాదయాత్ర కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ న్యాయస్థానానికి హాజరయ్యారు. విచారణ ముగిసే వరకు ఆయన కోర్ట్ హాల్‌లోనే వున్నారు.

అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు పలు రకాలుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు పాదయాత్రలు సైతం నిర్వహించారు. తాజాగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తమ పాదయాత్రకు అవాంతరాలు కలగకుండా పోలీసులను ఆదేశించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్ట్ విచారణ జరిపింది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ పాదయాత్రను నిలిపివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసింది. అయితే విచారణను చూసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హైకోర్టుకు వచ్చారు. విచారణ ముగిసే వరకు ఆయన హాలులోనే వున్నారు. 

ALso Read:అమ్ముడుపోవడమంటే ద్రోహమే... ఎమ్మెల్యేల బేరసారాలపై ఏపీ మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యలు

అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో మంత్రి అమర్‌నాథ్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆయన తనను కూడా ఈ వివాదంలో ఇంప్లీడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. విచారణ అనంతరం అమరావతి రైతుల యాత్రపై ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఈ విషయంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి శుక్రవారం విచారిస్తామని స్పష్టం చేసింది. 

ఇదిలా ఉంటే.. తాము చేపట్టిన పాదయాత్రను అడ్డుకుంటున్నారని అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గత శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రలో 600 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. ఎలాంటి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతించిన వారిని మినహాయించి ఎవరినీ అనుమతించవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. 

అలాగే ప్రత్యర్థి వర్గానికి చెందిన ఏ వర్గానికి అయినా పాదయాత్రకు సమీపంలో ఉండకుండా అనుమతులు ఇచ్చేటపుడు చూసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రలో నాలుగు వాహనాలకు మించి అనుమతించరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇక, రైతుల పాదయాత్రకు సంఘీభావాన్ని తెలియజేయాలనుకునే  వ్యక్తులు యాత్రలో చేరకుండా.. రోడ్డుకు ఇరువైపల ఉండ సంఘీభావం తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. 
 

click me!