హిందూపురం : రామకృష్ణారెడ్డి హత్య కేసులో 16 మంది అరెస్ట్... నిందితుల్లో ఎమ్మెల్సీ పీఏ

By Siva KodatiFirst Published Oct 27, 2022, 8:22 PM IST
Highlights

హిందూపురం వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్య కేసులో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు వున్నారు. నిందితుల్లో ఏ10గా ఎమ్మెల్సీ ఇక్బాల్ ఏపీ గోపీకృష్ణ కూడా వున్నారు. వ్యక్తిగత కక్షలు, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హిందూపురం వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్య కేసులో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు వున్నారు. నిందితుల్లో ఏ10గా ఎమ్మెల్సీ ఇక్బాల్ ఏపీ గోపీకృష్ణ కూడా వున్నారు. ఈ సందర్భంగా హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వ్యక్తిగత కక్షలు, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 

కాగా.. ఈ నెల 9వ తేదీన రామృష్ణారెడ్డి దారుణ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో నరికి అతి కిరాతకంగా చంపారు దుండగులు. అయితే ఈ దారుణం వెనక హిందూపురం వైసిపి నాయకులు, స్థానిక పోలీసుల హస్తం వుందని మృతుడి తల్లి లక్ష్మీనారాయణమ్మ తొలి నుంచి ఆరోపిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గ  వైసిపి సమన్వయకర్తగా గతంలో చౌళూరు రామకృష్ణారెడ్డి (46) పనిచేసారు. స్థానిక ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులతో విబేధాల కారణంగా అతడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు. ఈ విభేదాలే అతడి హత్యకు కారణమయ్యాయని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 

ALso REad:కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో నరికి ... హిందూపురంలో వైసిపి నేత దారుణ హత్య

స్వగ్రామం చౌళూరుకు సమీపంలోనే కర్ణాటక సరిహద్దులో రామకృష్ణారెడ్డి ఓ దాబాను నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం దాబాకు వెళ్లిన అతడు రాత్రివరకు అక్కడే వున్నాడు. దాబా మూసేవరకు అక్కడే వుండి రాత్రి 9గంటలకు కారులో ఇంటికి బయలుదేరాడు. అయితే అతడి కోసం ఇంటి సమీపంలోనే కాచుకుని కూర్చున్న దుండగులు కారు దిగగానే ఒక్కసారిగా దాడికి దిగారు. రెండు బైక్ లపై ముఖానికి మాస్కులు ధరించి వచ్చిన దుండగులు రామకృష్ణారెడ్డి కళ్లలో కారం చల్లి కత్తులతో దాడిచేసారు. విచక్షణారహితంగా కత్తులతో నరకడంతో అతడు అక్కడే రక్తపుమడుగులో కుప్పకూలాడు. 

తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డి చనిపోయాడని భావించిన దుండగులు అక్కడినుండి పరారయ్యారు. అయితే అతడు ప్రాణాలతో వుండటాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు కారులో హాస్పిటల్ కు తరలించారు. కానీ మార్గమధ్యంలోనే రామక‌ృష్ణా రెడ్డి మృతిచెందాడు. అతడి మృతదేహంపై 18 కత్తిపోట్లు వున్నట్లు గుర్తించారు.  

click me!