అమ్ముడుపోవడమంటే ద్రోహమే... ఎమ్మెల్యేల బేరసారాలపై ఏపీ మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 27, 2022, 7:50 PM IST
Highlights

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించాల్సిందిగా కోరుతూ పలువురు వ్యక్తులు బేరసారాలకు దిగిన వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. అమ్ముడుపోవడమనేది రాజకీయ ద్రోహమని ఆయన అన్నారు. 
 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించాల్సిందిగా కోరుతూ పలువురు వ్యక్తులు బేరసారాలకు దిగిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పక్కా సమాచారంతో పోలీసులు వీరిని వలపన్ని పట్టుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం వాతావరణం మరింత వేడెక్కింది. బీజేపీ నేతలే దీని వెనుక వున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. అధికార పార్టీ డ్రామాలు ఆడుతూ, తమపై నిందలు వేస్తోందని కాషాయ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదిలావుండగా ఎమ్మెల్యేల బేరసారాలపై ఏపీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడమనేది రాజకీయ ద్రోహమని.. పార్టీలో ఇమడలేకపోతే రాజీనామా చేసి తప్పుకోవడం ఉత్తమమని అమర్‌నాథ్ సూచించారు. విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమని.. త్వరలోనే వైజాగ్ నుంచే పాలన సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ALso REad:బీజేపీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించిన నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం...

ఇదిలా ఉండగా, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్కు చెందిన నందకిషోర్ (ఏ2), తిరుపతికి చెందిన సింహాయాజి (ఏ3)పై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఏసిపి తెలిపారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు.

బిజెపిలో చేరితే రూ.100  కోట్లు ఇప్పిస్తామని సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి ఆఫర్ చేశారని.. నందకిషోర్ మధ్యవర్తిత్వంతో ఫామ్ హౌస్ కు సతీష్ శర్మ, సింహాయాజి వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని బిజెపి తరఫున వారు హామీ ఇచ్చినట్లు పైలట్ రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.

ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నట్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. బీజేపీ లో చేరితే సెంట్రల్ సివిల్ కాంట్రాక్టర్ తో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పిన విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు రోహిత్ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

click me!