
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతు నిర్వహించడాన్ని ఆయన తప్పు బట్టారు. డ్యాములపై బల ప్రదర్శన తగదని హితవు పలికారు. సందుల్లో గొందుల్లో సభలు పెట్టి జనం ఎక్కువగా వచ్చినట్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.
ధవళేశ్వరం బ్యారేజీపై జగన్ డ్రోన్లతో సినిమా చూపిస్తే దానికి పోటీగా పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహిచారని ఆరోపించారు. తిత్లీ తుఫాన్ కు సర్వం కోల్పోయి శ్రీకాకుళం ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఉద్దానం ఉద్దానం అంటూ కలువరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు వెళ్లలేకపోయారని ప్రశ్నించారు.
మావోయిస్టుల దాడిలో ఓ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చనిపోతే బాధ్యతగల ప్రతిపక్ష నేతగా జగన్ ఇప్పటి వరకు స్పందించలేదని దేవినేని మండిపడ్డారు. మావోయిస్టుల దాడులను నిరసిస్తూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధర్నా చేద్దామని జగన్ కు సూచిస్తే జగన్ ఆయన వైపు సీరియస్ గా చూశారట అని ఆరోపించారు.