చంద్రబాబు నాయుడు నేరుగా గ్యాలరీలో నుంచే శాసనమండలి ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని మండిపడ్డారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు నేరుగా గ్యాలరీలో నుంచే శాసనమండలి ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని మండిపడ్డారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును శాసనమండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
చట్టసభలకు గౌరవం లేకుండా టీడీపీ ప్రవర్తించిందని మండిపడ్డారు. ఈ రోజు ఎంతో బాధతో కూడిన రోజని.. ప్రజాస్వామ్యంలో బ్లాక్‌డే కంటే ఘోరమైన రోజన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని.. ఎన్నో కమిటీలు అధ్యయనం చేసిన తర్వాతే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని బుగ్గన తెలిపారు.
Also read:జగన్‌కు షాక్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు
13 జిల్లాల అభివృద్ధే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని, సభలో యనమల వ్యవహరించిన తీరు సరికాదని రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. మండలిలో మొదటి రోజు నుంచి నిబంధనలు ఉల్లంఘించారని, నీతినియమాల గురించి అందరికీ చెప్పే యనమల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని బుగ్గన ధ్వజమెత్తారు.
బిల్లును ఓటింగ్‌కు పెట్టకుండా టీడీపీ నేతలంతా కలిసి ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారన్నారు. ఆమోదించకుండా, తిరస్కరించకుండా, ఉద్దేశ్యపూర్వకంగా సెలక్ట్ కమిటీకి పంపి.. తిరిగి అసెంబ్లీకి పంపకుండా అడ్డుకున్నారని బుగ్గన మండిపడ్డారు. విచక్షణాధికారం పేరుతో ఛైర్మన్ తన సొంతపార్టీకి అనుకూలంగా వ్యవహరించారని మంత్రి ఆరోపించారు.
Also Read:శాసనమండలిలో ముగిసిన చర్చ: సెలెక్ట్ కమిటీకి టీడీపీ పట్టు, వద్దన్న వైసీపీ
అంతకుముందు తనకున్న విచక్షణాధికారాలతో ఈ రెండు బిల్లులను ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే సభలో అధికారపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.
ఛైర్మన్ నిర్ణయం పట్ల తెలుగుదేశం ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేస్తుండగా, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ప్రస్తుతం అరుపులు, కేకలతో మండలి దద్దరిల్లుతోంది.