లండన్‌లో జగన్‌ ల్యాండింగ్‌ ‌: బుగ్గన క్లారిటీ ... ఇంటర్నేషనల్ ఫ్లైట్ రూల్స్ తెలుసా, యనమలకు చురకలు

Siva Kodati |  
Published : May 21, 2022, 05:09 PM ISTUpdated : May 21, 2022, 05:11 PM IST
లండన్‌లో జగన్‌ ల్యాండింగ్‌ ‌: బుగ్గన క్లారిటీ ... ఇంటర్నేషనల్ ఫ్లైట్ రూల్స్ తెలుసా, యనమలకు చురకలు

సారాంశం

పది రోజుల విదేశీ పర్యటన నిమిత్తం బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ విమానం లండన్‌లో ల్యాండైన వ్యవహారంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటరిచ్చారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించి నిబంధనలు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.   

స్విట్జర్లాండ్‌లోని (switzerland) దావోస్ పర్యటనకు (jagan davos tour) వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. లండన్‌లో దిగారంటూ వస్తోన్న కథనాలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) స్పందించారు. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనపై టీడీపీ (tdp) నేత యనమల రామకృష్ణుడు (yanamala ramakrishnudu) చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజుకు దిగజారిపోతున్నారని బుగ్గన ఫైరయ్యారు. 

గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. దీనిమీద పనిగట్టుకుని సీఎం జగన్‌ మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేయడాన్ని బట్టి యనమల లాంటి వారు, ఎల్లోమీడియా ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం అవుతోందని రాజేంద్రనాథ్ రెడ్డి దుయ్యబట్టారు.  దాపరికంతో, దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలను వంచించడం అన్నది టీడీపీ ట్రేడ్‌ మార్క్‌ తప్ప మాది కాదంటూ ఆయన చురకలు వేశారు.

ALso Read:దావోస్‌కని చెప్పి.. లండన్‌కా, ఈ మిస్టరీ వెనుక : జగన్ విదేశీ పర్యటనపై యనమల వ్యాఖ్యలు

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన రహస్యమేమీ కాదని.. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి దాపరికం లేదన్నారు.  శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగిందని.. దీనివల్లే లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యిందని మంత్రి తెలిపారు. 

లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉండటం.. ఈలోగా జ్యూరిచ్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందని బుగ్గన వెల్లడించారు. మళ్లీ ల్యాండింగ్‌ కోసం అధికారులు రిక్వెస్ట్‌ పెట్టారని... ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత జ్యూరిచ్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు ఇండియన్ ఎంబసీ అధికారులకు నివేదించారని మంత్రి చెప్పారు. 

ఈ సమాచారాన్ని స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు తెలియజేశారని.. దీంతో వారు నేరుగా ముఖ్యమంత్రి జగన్ వెంట వున్న అధికారులతో చర్చించి.. లండన్‌లోనే సీఎంకు బస ఏర్పాట్లు చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. తెల్లవారుజామునే జ్యూరిచ్ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు సుదీర్ఘంగా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం వారు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందని బుగ్గన తెలిపారు. 

వాస్తవాలు ఇలా ఉంటే.. సీఎం మీద అసూయతో, ద్వేషంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రతిరోజూ ఆయనపై బురదజల్లడం అలవాటుగా మారిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుందని మంత్రి చురకలు వేశారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే