
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల (ap budget session) సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగ సమయంలో చోటుచేసుకున్న గందరగోళంపై టిడిపి నాయకులు వివరణ ఇచ్చుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఏంచేసినా, గవర్నర్ నిండుసభలో అబద్ధాలు, అసత్యాలు వల్లెవేస్తున్నా తాముచూస్తూ ఊరుకోవాలా? అని టిడిపి నాయకులు ప్రశ్నించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చెప్పినట్లు స్పీకర్ నడుచుకుంటున్నారని... రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్నవ్యక్తే రాజ్యాంగ విలువలకు తూట్లుపొడుస్తున్న పాలకుల చర్యలను సమర్థిచడం సిగ్గుచేటని మండిపడ్డారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కేయగలరు కానీ కానీ ప్రజాక్షేత్రంలో నొక్కేయలేరని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (atchannaidu) అన్నారు.
''రాష్ట్ర గవర్నర్ కే తెలియకుండా ఏపీ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి వాటిని స్వార్థానికి వాడుకుంది. తన పేరుని కూడా అప్పుల కోసం ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసినా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ (biswabhusha n harichandan) స్పందించకపోవడం విచారకరం. బాధ్యతగల ప్రతిపక్షంగా తాము వాస్తవాలను ఆయనకు విన్నవించినా స్పందించలేదు. అందుకే గవర్నర్ ప్రసంగ సమయంలో వాకౌట్ చేయాల్సి వచ్చింది'' అని వివరించారు.
''నిబంధనలు, రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ ప్రభుత్వం అనేక పనులుచేస్తోంది. గతంలో రాత్రికి రాత్రే ఎన్నికల కమిషనర్ పై వేటు వేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ పై దాడి జరిగితే స్వయంగా ఛైర్మనే గవర్నర్ కు విన్నవించినా ఆయన స్పందించలేదు. మండలిలో స్వయంగా ఛైర్మన్ పై దాడి జరిగినప్పుడు కూడా గవర్నర్ లో చలనం లేదు. ఇలా అనేక అంశాల్లో రాష్ట్ర గవర్నర్ తీరు చాలాచాలా అభ్యంతరకరంగా సాగింది'' అని అచ్చెన్న గుర్తుచేసారు.
''అసెంబ్లీలో ప్రతిపక్షం, ప్రజల ఆమోదంతో గత ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించింది. దాన్ని ఈ ప్రభుత్వం రాత్రికిరాత్రే రద్దుచేసినా గవర్నర్ అలా ఎలా చేస్తారని ఏనాడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. పైగా ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ గుడ్డిగా సంతకం చేశారు. మూడు రాజధానుల బిల్లు విషయంలో గవర్నర్ తప్పుచేశారని సాక్షాత్తూ న్యాయస్థానమే వ్యాఖ్యానించింది'' అన్నారు.
''సభలో కానీ, బయటకానీ జరిగిన అనేక పరిణామాలపై, ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న తీరుపై గవర్నర్ కు మొరపెట్టుకున్నా, వినతిపత్రాలు ఇచ్చినా ఆయన ఏనాడూ స్పందించలేదు. పైగా నేడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో అంతా బాగుందని, ఈప్రభుత్వ పనితీరుని సమర్థిస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. గవర్నర్ ప్రసంగం ఆసాంతం ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ, రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచేలా సాగింది. ప్రసంగమంతా తప్పులతడక, అబద్ధాలపుట్టే. దాన్ని సమర్థిస్తే తాము ప్రభుత్వ చర్యలను, ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్థించినట్టే. కాబట్టే గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ అసెంబ్లీని టీడీపీ సభ్యులందరం బాయ్ కాట్ చేశాము'' అని అచ్చెన్న తెలిపారు.
''అధికారంలోఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, టీడీపీ ఎప్పుడూ ప్రజలపక్షమే. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాలని... రాష్ట్రం నాశనమవుతున్న తీరుని పాలకుల కళ్లకుకట్టేలా వివరించాలనే సభకు హజరయ్యాము. గవర్నర్ ప్రసంగంపై తమ అభ్యంతరాలను తెలియచెప్పడానికి తాము స్పీకర్ ని సమయం అడిగితే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తాము తప్పులు మాట్లాడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చెప్పిందే తాము మాట్లాడాలా... ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో అలా జరిగిందా?'' అని నిలదీసారు.
''టీడీపీ సభ్యులమైన మేము ప్రజలపక్షాన వాస్తవాలు మాట్లాడతాము... అవి వాస్తవాలుకాదని పాలకపక్షం సభలో వాస్తవాలతో నిరూపించాలి. అంతేగానీ తాము తప్పులు మాట్లాడతామని ముఖ్యమంత్రి, మంత్రులు ఎలాచెబుతారు? ప్రతిపక్షసభ్యులుగా తాము లేవనెత్తేవాటిపై అధికారంలో ఉన్నవారిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి, మంత్రులకు ఉంది. అదిచేయకుండా తాము మాట్లాడకూడదని చెప్పడం, స్పీకర్ కు చెప్పి ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరం'' అన్నారు.
''బీఏసీ సమావేశంలో తాము ప్రజలపక్షాన లేవనెత్తాల్సిన అంశాలను ప్రస్తావించాము. వాటన్నింటిపై చర్చజరిగేలా చూడాలని కోరాము. కానీ అధికారపక్షం మీరు 10-15 మందే ఉన్నారు కాబట్టి 10నిమిషాలకంటే ఎక్కువ సమయం ఇవ్వడం కుదరదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆలోచనలకు తావులేదు'' అన్నారు.
''రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రానికి పెద్దగా ఉన్న గవర్నర్ గారే మూడేళ్లనుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఎలా? గవర్నర్ గారే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోవాలా? గవర్నర్ ప్రసంగంపై ప్రజాస్వామ్యబద్ధంగానే తాము నిరసన వ్యక్తం చేశాము... ఎక్కడా హద్దులు మీరలేదు. గవర్నర్ గారి వయస్సుని గురించి మాట్లాడుతున్న వారు చంద్రబాబు వయస్సెంతో... ఆయన్నిఎందుకు అంతలా సభలోబాధ పెట్టారోకూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబుని అవమానించినప్పుడు, సభకు ఏమాత్రం సంబంధంలేని ఆయన సతీమణిని సభలో అనరాని మాటలన్నప్పుడు వైసీపీవారికి సభ్యతా సంస్కారాలు గుర్తుకురాలేదా? ఆనాడు సభలో అనాల్సినవన్నీ అనేసి, తిరిగి బయటకువచ్చాక తామేమీ అనలేదంటూ బుకాయించారు. రికార్డులు బయటపెట్టమంటే స్పందించలేదు. తామునేడుసభలో అవాస్తవాలు మాట్లాడితే అధికారంలో ఉన్నవారు వాస్తవాలు చెప్పొచ్చు కదా?'' అని అచ్చెన్న అన్నారు.