అమరావతి రైతుల పాదయాత్ర వస్తుంటే.. బంద్ నిర్వహించాలి : మంత్రి బొత్స వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 21, 2022, 4:37 PM IST
Highlights

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర ఏ ప్రాంతంలోకి వస్తే , ఆ ప్రాంతంలో బంద్ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. 

అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు చేస్తోన్న పాదయాత్రపై ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు, మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులెవ్వరూ తొడలు కొట్టరని.. ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొట్టరని మంత్రి అన్నారు. పాదయాత్ర ఏ ప్రాంతంలోకి వస్తే , ఆ ప్రాంతంలో బంద్ పాటించాలని ఆయన సూచించారు. ఉత్తరాధ్ర ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని బొత్స కోరారు.  రైతుల ముసుగులో టీడీపీ నేతలు పాదయాత్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. భవిష్యత్‌ను చంద్రబాబు అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది అబద్ధం అని చంద్రబాబు, టీడీపీ నేతలు నిరూపిస్తారా అని బొత్స ప్రశ్నించారు. నిరూపిస్తే మంత్రి పదవికి తాను అనర్హుడిగా నిర్ణయించుకుంటానని.. చంద్రబాబుకి మద్ధతుగా పవన్ కల్యాణ్ వచ్చారని సత్యనారాయణ ఆరోపించారు. 

ALso REad:పాదయాత్రలో 600 మంది కంటే ఎక్కువ పాల్గొనవద్దు:ఏపీ హైకోర్టు ఆదేశం

ఇకపోతే.. అమరావతి పాదయాత్రలో 600 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్రకు మద్ధతిచ్చేవారంతా రోడ్డుకు ఇరువైపులా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి నుండి అరసవెల్లి వరకు రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారించింది. ఈ విషయమై ఇరు వర్గాల  వాదనలను హైకోర్టు పరిగణనలోనికి తీసుకుంది. పాదయాత్రలో 600 మంది  మాత్రమే పాల్గొనాలని .. పాదయాత్రకు సంఘీభావం  ప్రకటించేవారు  రోడ్డుకు ఇరువైపులా ఉండాలని సూచించింది. అలాగే పాదయాత్రలో నాలుగు వాహనాలకు మాత్రమే హైకోర్టు అనుమతిని ఇచ్చింది. పాదయాత్ర  ప్రశాంతంగా  జరిగేలా  చూడాలని  పోలీసు శాఖను ఆదేశించింది.
 

click me!