చివరికి ధర్మమే గెలిచింది.. త్వరలో పరిపాలనా రాజధానికి శంకుస్థాపన: బొత్స

By Siva KodatiFirst Published Jul 31, 2020, 6:44 PM IST
Highlights

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో బొత్స మీడియాతో మాట్లాడారు

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో బొత్స మీడియాతో మాట్లాడారు.

త్వరలోనే మంచి ముహూర్తం చూసి విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ శంకుస్థాపన చేస్తారని బొత్స  వివరించారు. శ్రావణ శుక్రవారం కానుకగా గవర్నర్ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించారని బొత్స అభివర్ణించారు.

గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని మంత్రి అన్నారు. శాసనమండలిలో బిల్లులను వీధి రౌడీల్లా అడ్డుకున్నారని బొత్స మండిపడ్డారు. మండలిలో టీడీపీకి సంఖ్యాబలం వుందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని, తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా చివరికి ధర్మానిదే విజయమని బొత్స వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల నిర్ణయంతో 13 జిల్లాలకు సమన్యాయం జరుగుతుందని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి కూడా రాష్ట్రంలో అంతర్భాగమేనని.. ఈ రోజు చారిత్రాత్మకమైన రోజన్నారు. 

click me!