బాస్ సంతోషం కోసం ఛైర్మన్ ఇలా చేశారు: బొత్స వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 22, 2020, 10:10 PM IST
Highlights

ఈరోజు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును శాసనమండలి ఛైర్మన్‌ సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు

ఈరోజు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును శాసనమండలి ఛైర్మన్‌ సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

చట్టసభల చరిత్రలో ఒక మాయని మచ్చని, దీనివల్ల ఈ బిల్లు రావడం ఒక పదిరోజులు ఆలస్యం కావొచ్చు కానీ టీడీపీ, కౌన్సిల్ ఛైర్మన్ ఈ మచ్చను ఎప్పటికీ పొగొట్టుకోలేరని బొత్స మండిపడ్డారు. ఈ బిల్లు కోసం విచక్షణ అధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఏముందని సత్యనారాయణ ప్రశ్నించారు.

Also Read:జగన్‌కు షాక్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

కౌన్సిల్ చైర్మన్ తన బాస్ చంద్రబాబు ను సంతోష పెట్టడం కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. విచక్షణ అధికారాలు అనేవి అందరికీ ఉంటాయని టీడీపీ గుర్తించాలని, అయినా తాము అధికారాన్ని దుర్వినియోగం చెయ్యమన్నారు బొత్స.

చంద్రబాబు.. కౌన్సిల్ చైర్మన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు నేరుగా గ్యాలరీలో నుంచే శాసనమండలి ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని మండిపడ్డారు.

చట్టసభలకు గౌరవం లేకుండా టీడీపీ ప్రవర్తించిందని మండిపడ్డారు. ఈ రోజు ఎంతో బాధతో కూడిన రోజని.. ప్రజాస్వామ్యంలో బ్లాక్‌డే కంటే ఘోరమైన రోజన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని.. ఎన్నో కమిటీలు అధ్యయనం చేసిన తర్వాతే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని బుగ్గన తెలిపారు.

Also Read:మండలి గ్యాలరీలో బాలకృష్ణతో రోజా సెల్ఫీ: ఫ్రేమ్ లో చంద్రబాబు సైతం...

13 జిల్లాల అభివృద్ధే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని, సభలో యనమల వ్యవహరించిన తీరు సరికాదని రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. మండలిలో మొదటి రోజు నుంచి నిబంధనలు ఉల్లంఘించారని, నీతినియమాల గురించి అందరికీ చెప్పే యనమల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని బుగ్గన ధ్వజమెత్తారు.

బిల్లును ఓటింగ్‌కు పెట్టకుండా టీడీపీ నేతలంతా కలిసి ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారన్నారు. ఆమోదించకుండా, తిరస్కరించకుండా, ఉద్దేశ్యపూర్వకంగా సెలక్ట్ కమిటీకి పంపి.. తిరిగి అసెంబ్లీకి పంపకుండా అడ్డుకున్నారని బుగ్గన మండిపడ్డారు. విచక్షణాధికారం పేరుతో ఛైర్మన్ తన సొంతపార్టీకి అనుకూలంగా వ్యవహరించారని మంత్రి ఆరోపించారు. 

click me!