మీ సంగతి మీరు చూసుకోండి.. ఏపీ గురించి నీకెందుకు : హరీశ్‌రావుకు బొత్స సత్యనారాయణ కౌంటర్

By Siva Kodati  |  First Published Apr 12, 2023, 7:58 PM IST

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. మా రాష్ట్రం గురించి మాకు తెలుసునని.. మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోవాలని బొత్స చురకలంటించారు. 
 


ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. హరీష్ రావు రాజాకీయాల కోసం ఏదైనా‌ మాట్లాడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావుకు ఏపీ గురించి మాట్లాడడానికి ఏం సంబంధం వుందని బొత్స ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీష్ రావు ఎవరని ఆయన నిలదీశారు. బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గుర్తెరిగి మాట్లాడాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. మా రాష్ట్రం గురించి మాకు తెలుసునని.. మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోవాలని బొత్స చురకలంటించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుపైనా బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన ఒక్క అభివృద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్, జగన్ హయాంలలో చేసినవి తాను చెబుతానన్నారు. రైతులకు, సామాన్యులకు, పేదల కోసం ఏం చేశామో చెబుతానని బొత్స చెప్పారు. చంద్రబాబు ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తని.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడతాడని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్లు , స్ధానికత అంశంపై సమావేశం నిర్వహించామని.. ఒక డ్రాఫ్ట్ తయారు చేశామని, త్వరలోనే ఉద్యోగులతో చర్చించి క్యాబినెట్ లో పెడతామని బొత్స స్పష్టం చేశారు.

Latest Videos

ఇదిలా ఉంటే, హరీష్ రావు మంగళవారం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి  తెలంగాణకు వచ్చి ఇక్కడి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికులు ఇక్కడే (తెలంగాణలో) వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ఏపీ, తెలంగాణకు భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని కూడా అన్నారు. ‘‘ఏపీతో పోలిస్తే తెలంగాణలోని ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల్లో రోడ్లు, సేవలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ బాగా తెలుసు’’ అని కూడా హరీష్ రావు కామెంట్ చేశారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను వినియోగించుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు కాకుండా కేవలం తెలంగాణలోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు. 

Also Read: ఏపీలో అధికార పక్షం అడగదు.. ప్రతిపక్షం ప్రశ్నించదు.. మా జోలికి రావొద్దు: కారుమూరి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. హరీశ్ రావు ఏపీకి వస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తామని కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. చినుకు పడితే హైదరాబాద్ మునిగిపోతుందని.. నగర పరిస్ధితిని ఘోరంగా మార్చింది మీరేనంటూ ఆమన విమర్శలు గుప్పించారు. సకల సౌకర్యాలతో వచ్చిన తెలంగాణను ఎలా తగలేస్తున్నారో మీ రాష్ట్ర ప్రజలు, విపక్షాలే చెబుతున్నాయని కారుమూరి కౌంటరిచ్చారు. ముందు వాళ్లకు సమాధానం చెప్పుకోండి అంటూ నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు సరిగా లేవన్న హరీశ్ రావు వ్యాఖ్యలను కూడా కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు. హైదరాబాద్‌లో మాత్రమే రోడ్లు వేస్తే పని అయిపోయిందా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజలకు ఎన్ని సదుపాయాలు అందుతున్నాయో వచ్చి చూడాలని.. ఓట్లేసే వాళ్లకే కాదు, ఓట్లు వేయని పిల్లలకు కూడా జగన్ సేవ చేస్తున్నారని కారుమూరి నాగేశ్వరరావు ప్రశంసించారు. విద్య విషయంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో వుండేదని.. ఇప్పుడు 3వ స్థానానికి వచ్చిందంటే సీఎం జగన్ వల్లేనని కారుమూరి తెలిపారు. 
 

click me!