
విశాఖపట్నం జిల్లా తెలుగుదేశంలో ముసలం తప్పేట్లు లేదు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య వైరం జిల్లా మొత్తాన్ని పుట్టి ముంచేట్లే ఉంది. ఈరోజు భూకుంభకోణంపై విచారించేందుకు ప్రభుత్వం నియమించిన సిట్ ఎదుట హాజరై అన్నీ వివరాలు మంత్రి అందచేసారు. దాంతో కుంభకోణంపై విచారణలో చింతకాయల ఏం చెప్పారన్న విషయమై పార్టీలో ఉత్కంఠ మొదలైంది.
అసలే వీరిద్దరి మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పు. అటువంటిది భూకుంభకోణంలో గంటా అడ్డంగా చింతకాయలకు దొరికారు. అవకాశం దొరికితే చాలు ఒకరిని మరొకరు ఇబ్బందుల్లోకి నెట్టేందుకే చూస్తారు. వీరిద్దరి మధ్య సయోధ్య చేయటానికి అనేకమార్లు ప్రయత్నించి చంద్రబాబునాయుడే ఫైల్ అయ్యారు. అటువంటి సమయంలో గంటా లడ్డూలాగ చింతకాయలకు దొరికారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించి, టిడిపిని ఇబ్బందుల్లోకి నెట్టేసిన భూకుంభకోణంకు కీలకపాత్రదారి గంటానే అంటూ చింతకాయల మండిపడుతున్నారు.
శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారుల విచారణ బృందం మంత్రిని సుమారు 15 నిముషాల పాటు విచారించింది. భూకుంభకోణానికి దారితీసిన పరిస్ధితులు, తన వద్ద ఉన్న సమాచారం, ఆధారాలు, కుంభకోణంపై మీడియాలో వచ్చిన క్లిప్పింగులను కూడా మంత్రి సిట్ కు అందచేసారు.
విచారణ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కుంభకోణంపై తన వద్దవున్న సమాచరం మొత్తాన్ని సిట్ కు అందచేసినట్లు చెప్పారు. కొంతమంది నేతలు ప్రభుత్వ భూములను సొంతం చేసేసుకుని బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయలు కుదవ పెట్టేయటం చాలా దారుణమన్నారు. ప్రభుత్వ భూములనే కాకుండా చివరకు రోడ్లను సైతం సొంతం చేసేసుకుని తాకట్టు పెట్టేయటం నిజంగా దురదృష్టకరమన్నారు. నేరుగా గంటా పేరెత్తి ఎటువంటి వ్యాఖ్యలు చేయకున్నా ఆరోపణలు మొత్తం గంటాపైనే చేస్తున్న విషయం అందరికీ తెలిసిపోయేట్లుగానే చింతకాయల మాట్లాడారు.
2014 నుండి భూ కుంభకోణం గురించి జిల్లా కలెక్టర్ కు చెబుతూనే ఉన్నా పట్టించుకోలేదని చెప్పటం గమనార్హం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా లేఖలు రాసినట్లు చెప్పారు. వీరిలో ఏ ఒక్కరూ తన లేఖపై స్పందించలేదన్నారు. 1600 ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులను ట్యాంపరింగ్ చేసారని చింతకాయల చెప్పటం చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.