మంత్రి రాసలీలల ఆడియో: తన ఎదుగుదల చూడలేకే అంటున్న అవంతి

By telugu news teamFirst Published Aug 20, 2021, 7:44 AM IST
Highlights

చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దేవుడి పట్ల తనకు నమ్మకం ఉందన్నారు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి అవంతి పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు అంటూ... ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో టేపు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఆరోపణలపై  అవంతి స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక కొందరు కుట్ర చేస్తున్నారని  ఆయన ఆరోపించారు.

తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు.  తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు ఎవరితోనూ శత్రుత్వంలేదని వ్యాఖ్యానించారు. తనపై ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు. చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దేవుడి పట్ల తనకు నమ్మకం ఉందన్నారు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి అవంతి పేర్కొన్నారు. 

దీనిపై పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హాకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ద్వారా విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇలా క్రియేట్‌ చేస్తున్నవారి నిగ్గుతేల్చాలని కోరినట్లు చెప్పారు. విశాఖలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. మంచితనంతో అంచెలంచెలుగా ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగానని చెప్పారు.

రాజకీయంగా తనపై పోటీచేసిన ప్రత్యర్థులను కూడా మిత్రులుగానే చూసే వ్యక్తినన్నారు. జిల్లాలో ఏకైక మంత్రిగా తాను చేసే మంచిపనులు, పార్టీ అభివృద్ధి చూడలేకనే సోషల్‌ మీడియాలో ఫేక్‌ వీడియోతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్‌ మీడియాలో మంచి కన్నా చెడు త్వరగా ప్రచారం జరుగుతుందన్నారు. ఇందులో ఎవరున్నా వదిలేది లేదని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంతవరకు ఎవరూ తన ఎదుగుదలను అడ్డుకోలేరన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలను, రాష్ట్రంలో పార్టీ శ్రేణులను, అభిమానులను  కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బవైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

click me!