వివాహేతర సంబంధం... పొలంలో చంపి, క్రిష్ణనదిలో విసిరేసి... !

By AN TeluguFirst Published Aug 20, 2021, 7:25 AM IST
Highlights

సుంకమ్మ మేనమామ ప్యాపిలి మండలం కలసట్ల గ్రామానికి చెందిన శంకరయ్యకు, పెద్దయ్య భార్య బాలక్కతో వివాహేతర సంబంధం ఉంది. బాలక్కకు, శంకరయ్యకు మధ్య వ్యవహారం ఏడాది కింద పెద్దయ్యకు తెలిసిపోయింది.  దీంతో ఏమైనా చేస్తారేమోనని భావించిన శంకరయ్య... ముందుగానే పెద్దయ్య చంపడానికి పథకం రచించాడు.

అనంతపూర్ : వివాహేతర సంబంధం చివరికి ఒకరి హత్యకు దారితీసింది. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ శ్యామారావు  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య వివరాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ఎదురూరుకు చెందిన పెద్దయ్య ఈనెల 11న అదృశ్యమయ్యాడు. ఈ మేరకు అతడి తల్లి సుంకమ్మ 15న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  

దీంతో తమ సిబ్బంది అదృశ్యం కేసు నమోదు చేశారు. సీఐ శ్యామారావు, ఎస్ఐ చాంద్ భాషా రెండు బృందాలుగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు.  ఎదురూరు గ్రామానికి చెందిన సుంకమ్మ అలియాస్ సుజాతకు కొన్నేళ్ల కిందట పత్తికొండ కు చెందిన రమేష్ తో వివాహం అయ్యింది. ఆమె ఎదురూరుకు చెందిన పెద్దయ్యతో (34) వివాహేతర బంధం కొనసాగించింది.

మరోవైపు సుంకమ్మ మేనమామ ప్యాపిలి మండలం కలసట్ల గ్రామానికి చెందిన శంకరయ్యకు, పెద్దయ్య భార్య బాలక్కతో వివాహేతర సంబంధం ఉంది. బాలక్కకు, శంకరయ్యకు మధ్య వ్యవహారం ఏడాది కింద పెద్దయ్యకు తెలిసిపోయింది.  దీంతో ఏమైనా చేస్తారేమోనని భావించిన శంకరయ్య... ముందుగానే పెద్దయ్య చంపడానికి పథకం రచించాడు.

శంకరయ్య తన మేనకోడలు సుంకమ్మ సహాయంతో  ఈనెల 11న రాత్రి 9:30 గంటలకు పెద్దయ్యను పత్తికొండ పిలిపించుకున్నాడు. తన అల్లుడైన కలసట్లకు చెందిన శ్రీనివాసులు, ప్యాపిలీకి చెందిన వాహన యజమాని భాస్కర్ రెడ్డిలతో కలిసి సుమారు పదిన్నర గంటల సమయంలో పత్తికొండ గురుకుల పాఠశాలకు 400 మీటర్ల దూరంలో వైకూడలి పక్కనే ఉన్న పొలంలో పెద్దయ్యను హతమార్చారు.  

ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పత్తికొండ నుంచి ప్యాపిలీ మీదుగా 44వ జాతీయ రహదారిపై వెళ్లి తెలంగాణ రాష్ట్రం బీచ్పల్లి కృష్ణా నది వంతెన పైనుంచి కృష్ణా నదిలోకి పడేశారు. నది పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మృతదేహం లభ్యమైంది. 

దీంతో అదృశ్యం కేసును హత్యకేసుగా మార్చి నిందితులైన సుంకమ్మ, శంకరయ్య,  శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గుత్తి కోర్టులో హాజరుపరిచారు.  త్వరితగతిన కేసును ఛేదించిన సిఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను డిఎస్పీ అభినందించారు. 

click me!