పోలవరం నిర్మాణంలో రాబోయే నాలుగైదు నెలలు కీలకం.. ప్రారంభోత్సవానికి డెడ్‌లైన్‌‌లు ఎందుకు?: మంత్రి అంబటి

Published : Mar 05, 2023, 12:24 PM IST
 పోలవరం నిర్మాణంలో రాబోయే నాలుగైదు నెలలు కీలకం.. ప్రారంభోత్సవానికి డెడ్‌లైన్‌‌లు ఎందుకు?: మంత్రి అంబటి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఉదయం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అధికారులతో మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఉదయం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అధికారులతో మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంత్రి అంబటి రాంబాబు సమీక్ష చేపట్టారు. అనంతరం అంబటి  రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తొందరపాటుతో పోలవరం ప్రాజెక్ట్‌కు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. గోదావరికి‌ వచ్చిన వరదలు డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించడం.. అప్పర్, లోయర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అన్నారు. 

తాను రాజకీయ ఆరోపణలు చేయడం లేదని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అవగాహన లేకనో, తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయాలనో కాపర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వేయటం వలన అనర్థం జరిగిందనేది నిపుణుల అభిప్రాయం అని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ వేసి.. కాపర్ డ్యామ్‌లు కట్టకపోయిన ఇంత అనర్థం జరిగేది కాదన్నారు. డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని చెప్పారు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూసెక్కుల ఇసుక అవసరం అని చెప్పారు. 

డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్‌ చేయడం కోసం రూ.2 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారని చెప్పారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో దెబ్బతిన్న భాగం మొత్తం బాగుచేసి ఎలా పనులు ముందుకు తీసుకెళ్లాలని అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని చెప్పారు. 

ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొందరపాటు, డెడ్‌లైన్‌లు ఎందుకని ప్రశ్నించారు. వేళ ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రాజెక్టు‌ పనులు  కాస్త ఆలస్యమైనా నాణ్యతతో ఉండాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ కలలు కన్న ప్రాజెక్టు పోలవరం అని.. దీనిని సీఎం జగన్ చేతుల మీదుగానే ప్రారంభిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్‌లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: ఫోన్లోనే అధికారులకి చెమటలు పట్టించిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet
Ayyanna Patrudu Speech: అయ్యన్న పాత్రుడు స్పీచ్ కి సభ మొత్తం నవ్వులే నవ్వులు| Asianet News Telugu