పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జాతీయ జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని జాతీయ జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది.
Janasena: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య భీకర పోటీ ఉన్నది. ఈ సారి టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ చాలా సార్లు అన్నారు. దానికోసమే పొత్తు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అంతా అనుకున్నట్టుగా ముందుకు సాగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్‌కు పెద్ద షాక్ తగిలింది.
జనసేన పార్టీ 2019లో గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు. అయితే, అప్పుడు ఆయన పార్టీకి ఓటు శాతం చాలా తక్కువే పడింది. ఆరు శాతంలోపే జనసేన పార్టీకి ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సంఘం ప్రకారం ఆరు శాతం ఓట్లు ఒక పార్టీకి పోలైతే.. ఆ పార్టీకి కేటాయించిన సింబల్‌ను రిజర్వ్ చేస్తారు. ఇక ఎప్పటికీ ఆ సింబల్ ఆ పార్టీకే చెందినదిగా ఉంటుంది. కానీ, జనసేన పరిస్థితి వేరు. పవన్ కళ్యాణ్ పార్టీకి ఆరు శాతం ఓట్లు పడకపోవడంతో కేటాయించిన గాజు గ్లాసు జనసేనకు రిజర్వ్ కాలేదు. ఇప్పటికీ ఈ గాజు ఫ్రీ సింబల్ లిస్టులోనే ఉన్నది.
Also Read: చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఒకే కారులో ఉండవల్లికి లోకేష్, పీకే .. ఏపీ రాజకీయాల్లో కలకలం
ఈ సందర్భంలో జాతీయ జనసేన పార్టీ.. పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చింది. ఫ్రీ సింబల్ లిస్టులో ఉన్న గాజు గ్లాసును తమకే కేటాయించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. నిజానికి జాతీయ జనసేన పార్టీకి ఈసీ బక్కెట్ గుర్తును కేటాయించింది. కానీ, ఈ గుర్తును కాదని, తమకు ఫ్రీ సింబల్ లిస్టులో ఉన్న గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని కోరింది. సదరు పార్టీ కోరిక మేరకు గాజు గ్లాసును జాతీయ జనసేన పార్టీకి కేటాయించే విచక్షణాధికారాలు ఎన్నికల సంఘానికి ఉంటాయి. అందుకే జనసేన పార్టీలో ఆందోళన మొదలైంది.
జాతీయ జనసేన పార్టీ హైదరాబాద్ బేస్‌గా పుట్టింది. డీ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఈ పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి షాకుల మీద షాకులు ఇవ్వబోతున్నది. అయితే, జనసేన పార్టీ ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.