టీడీపీ తొందరపాటు వల్లే.. పోలవరం ఆలస్యం, సమస్యలు ఆ నిర్ణయాలతోనే : అంబటి రాంబాబు ఆగ్రహం

Siva Kodati |  
Published : Feb 10, 2023, 09:21 PM IST
టీడీపీ తొందరపాటు వల్లే.. పోలవరం ఆలస్యం, సమస్యలు ఆ నిర్ణయాలతోనే : అంబటి రాంబాబు ఆగ్రహం

సారాంశం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి మంత్రి అంబటి రాంబాబు సమీక్ష నిర్వహించారు. టీడీపీ తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైందని, కేంద్రం సహకరించకున్నా పోలవరాన్ని తాము పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.   

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పోలవరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం తొందరపాటు పనులవల్లే ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైందన్నారు. యుద్ధ ప్రాతిపదికన కాఫర్ డ్యాం ఎత్తును పెంచామని.. గత ప్రభుత్వం కాఫర్ డ్యాం పనులను గాలికొదిలేసిందని రాంబాబు దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్న ఆయన.. అక్కడినుంచి నిధులు విడుదల కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే పోలవరాన్ని నిర్మిస్తోందని అంబటి స్పష్టం చేశారు.

నిపుణుల రిపోర్ట్ అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాలా లేక పాతదే వుంచాలో నిర్ణయిస్తామని రాంబాబు తెలిపారు. 41.17 కాంటూరు పరిధి వరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించలేదని రాంబాబు స్పష్టం చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని.. అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌పై తాము న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా వున్నామని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 

ఇకపోతే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇటీవల కేంద్రం కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న టైమ్‌లైన్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను 2024 జూన్ నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్‌ చేయబడిందని కేంద్రం తెలిపింది. అయితే గోదావరి నదికి 2020, 2022లో భారీగా వరదలు పోటెత్తిన నేపథ్యంలో.. ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని  పేర్కొంది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

Also REad: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో వెల్లడించిన కేంద్రం.. వివరాలు ఇవే..

2016 సెప్టెంబర్ 30 నాటి  ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండంకి అనుగుణంగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్  కోసం నిధులు అందజేయబడుతున్నాయని తెలిపారు. 2014 ఏప్రిల్ 1 నుంచి నీటిపారుదల కాంపోనెంట్‌కు ఖర్చును రీయింబర్స్ చేయాలని అందులో ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అర్హత గల వ్యయాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నుంచిధృవీకరించబడిన బిల్లులు, సిఫార్సులను స్వీకరించిన తర్వాత రీయింబర్స్‌మెంట్ చేయబడుతుందని చెప్పారు. 

2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 2022 వరకు పోలవరం ప్రాజెక్ట్‌పై 16,035.88 కోట్లు వెచ్చించినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలియజేసిందని చెప్పారు. అయితే ఇందులో అర్హత కలిగిన మొత్తం రూ.13,226.04 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. రూ. 2,390.27 కోట్లు విలువ గల బిల్లులు పీపీఏ ద్వారా రీయింబర్స్‌మెంట్‌కు అర్హత పొందలేదని చెప్పారు. రూ.548.38 కోట్ల బిల్లులు పీపీఏ పరిశీలనలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu