పేపర్ల లీక్‌తో డబ్బు .. అందుకే నారాయణకు నెంబర్ వన్ ర్యాంకులు : అంబటి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 10, 2022, 03:03 PM ISTUpdated : May 10, 2022, 03:04 PM IST
పేపర్ల లీక్‌తో డబ్బు .. అందుకే నారాయణకు నెంబర్ వన్ ర్యాంకులు : అంబటి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ల లీకేజ్ ఘటనలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పేపర్ లీకేజ్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారని.. అందుకే నారాయణ విద్యాసంస్థలకు ర్యాంకులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.   

నారాయణ కాలేజీల్లో (narayana college) టెన్త్ పేపర్ లీకేజ్ (ssc question paper leak) జరిగిందని మంత్రి అంబటి రాంబాబు (ambati narayana) అన్నారు. నారాయణ కాలేజీల నుంచే పేపర్లు లీకయ్యాయని.. వీళ్లే పేపర్లు లీక్ చేసి గొడవ చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. విచారణ తర్వాతే నారాయణను అరెస్ట్ చేశారని.. నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ స్టేట్‌మెంట్ తర్వాతే విషయం బయటికొచ్చిందన్నారు. పేపర్లు లీక్ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారని.. పేపర్ లీకేజీల వల్లే నారాయణ విద్యాసంస్థలకు (narayana educational institutions) నంబర్ వన్ వస్తోందంటూ అంబటి దుయ్యబట్టారు. పేపర్ లీక్ వ్యవహారంలో నారాయణ ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించారని.. వాళ్లేమో పేపర్లు లీక్ చేయొచ్చని, యాక్షన్ మాత్రం తీసుకోవద్దా అంబటి రాంబాబు ఫైరయ్యారు. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, తిరుపతిలోని నారాయణ స్కూల్స్  బ్రాంచీలో  టెన్త్ క్లాస్   తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ క్రమంలోనే నారాయణను మంగళవారం ఉదయం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏపీకి తరలిస్తున్నారు. అయితే నేడు నారాయణ నివాసంలో ఆయన కుమారుడు నిషిత్ వర్దంతి కార్యక్రమం జరగాల్సి ఉంది. కుమారుడి వర్దంతి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే నారాయణను పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈవిధంగా తీసుకెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నారాయణ  కుమారుడు నితీష్.. ఐదేళ్ల క్రితం ఇదే రోజు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

ఇదిలా ఉంటే ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో పేపర్స్ లీకేజీకి సంబంధించి శ్రీచైతన్య స్కూల్స్  పాత్ర కూడా ఉందని  స్వయంగా సీఎం జగన్ ఇటీవల తిరుపతి సభలో తెలిపారు. వ్యవస్థను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!