తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు చంద్రబాబుతో సహా పలువురిపై కేసు నమోదు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు చంద్రబాబుతో సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఈపీఎల్ ప్రాజెక్ట్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్, హెరిటేజ్ ఫుడ్స్ పేర్లను చేర్చారు.
ఇందుకు సంబంధించి గత నెల 27నే ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు.. అవతవకలు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్దారించినట్టుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఈపీఎల్ ప్రాజెక్ట్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్, హెరిటేజ్ ఫుడ్స్‌ల పై 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 ఐపీసీ సెక్షన్లతోపాటు అవినితి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(ఏ) కింద కడా కేసు నమోదు చేశారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు నారాయణను ఏపీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, తిరుపతిలోని నారాయణ స్కూల్స్ బ్రాంచీలో టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే నారాయణను మంగళవారం ఉదయం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏపీకి తరలిస్తున్నారు.