
టెన్త్ పరీక్షా పత్రాల లీకేజ్ (ssc exam paper leak) వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ (tdp) సీనియర్ నేత నారాయణను (narayana) అరెస్ట్ చేయడంపై మాజీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandra mohan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్త్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పరువు పోయిందని.. ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేశారని ఆయన గుర్తుచేశారు. విద్యాశాఖ మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చాక నారాయణ విద్యా సంస్థల (narayana educational institutions) నిర్వహణ నుంచి తప్పుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. నారాయణ విద్యా సంస్థలంటే అంత తేలిగ్గా వుందా.. మాజీ మంత్రిని అరెస్ట్ చేసి దోషిగా నిలబెడతారా అని ఆయన ప్రశ్నించారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, తిరుపతిలోని నారాయణ స్కూల్స్ బ్రాంచీలో టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే నారాయణను మంగళవారం ఉదయం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏపీకి తరలిస్తున్నారు. అయితే నేడు నారాయణ నివాసంలో ఆయన కుమారుడు నిషిత్ వర్దంతి కార్యక్రమం జరగాల్సి ఉంది. కుమారుడి వర్దంతి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే నారాయణను పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈవిధంగా తీసుకెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నారాయణ కుమారుడు నితీష్.. ఐదేళ్ల క్రితం ఇదే రోజు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఇదిలా ఉంటే ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో పేపర్స్ లీకేజీకి సంబంధించి శ్రీచైతన్య స్కూల్స్ పాత్ర కూడా ఉందని స్వయంగా సీఎం జగన్ ఇటీవల తిరుపతి సభలో తెలిపారు. వ్యవస్థను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.