చంద్రబాబు హెరిటెజ్ వ్యాపారం ఏపీలో ఉంది.. పెట్టుబడులు తరలిపోతున్నాయనే ప్రచారం అవాస్తవం: మంత్రి అమర్‌నాథ్

By Sumanth KanukulaFirst Published Dec 3, 2022, 2:15 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయనే ప్రచారం అవాస్తమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఏపీలో పెట్టాల్సిన పెట్టబడులు ఇక్కడ పెట్టకుండా తెలంగాణలో పెడుతున్నట్టుగా అమరరాజా కంపెనీ ప్రతినిధులు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయనే ప్రచారం అవాస్తమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్టా అని ప్రశ్నించారు. అమరరాజా కంపెనీ రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంటే.. ఏపీ నుంచి ఆ కంపెనీని వెళ్లగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని దుష్ప్రచారం  చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పెట్టాల్సిన పెట్టబడులు ఇక్కడ పెట్టకుండా తెలంగాణలో పెడుతున్నట్టుగా అమరరాజా కంపెనీ ప్రతినిధులు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. అమరరాజా గ్రూప్ ఏపీ మాత్రమే వ్యాపారం చేయాలని.. ఇంకా ఎక్కడ చేయకూడదనే చట్టం ఉందా అని అడిగారు. అమరరాజా గ్రూప్‌కు సంబంధించిన పలు పరిశ్రమలు ఏపీలో నడుస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటెజ్‌ వ్యాపారం ఏపీలోనే ఉందని అన్నారు. హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. ఆ కంపెనీ ఏపీలో కూడా కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందా? అని ప్రశ్నించారు. 

ప్రభుత్వాన్ని ఏదో రకంగా బద్నాం చేయాలనే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు.  ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే.. ఎప్పుడు ఎవరొ ఒకరు వెళ్లిపోవాలనే కోరికతో ప్రతిపక్షాలు ఉన్నాయని విమర్శించారు.  

సీఎం జగన్ పాలనలో ఏ పరిశ్రమను కూడా  రాజకీయ కోణంలో చూడలేదన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే ఆదాయం పెరుగుతుంది, నలుగురికి ఉపాధి దొరుకుంతుందనేదే ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతి వారికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 

click me!