ఎన్‌ఆర్‌ఐ, అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రులలో కొనసాగుతున్న ఈడీ సోదాలు..

By Sumanth KanukulaFirst Published Dec 3, 2022, 10:55 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్ ఆస్పత్రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు రెండు రోజు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్ ఆస్పత్రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు రెండు రోజు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం రెండు ఆస్పత్రుల్లో సోదాలు ప్రారంభించిన అధికారులు రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎనిమిది గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌కు సంబంధించి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, నళినీమోహన్, ఉప్పలపు శ్రీనివాసరావు నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి మరోసారి ఈ రెండు ఆస్పత్రులలో సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర బలగాల భద్రత నడుమ ఈడీ  అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. 

మనీలాండరింగ్, కోవిడ్ సమయంలో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజీ నిధులను డైరెక్టర్ల ఖాతాల్లోకి మళ్లించడం వంటి ఆరోపణలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రెండు ఆసుపత్రుల నుంచి కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్కినేని ఆస్పత్రి నిర్మాణం, ఇతర  వ్యవహారాలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్కినేని మణి పాత్రపై వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఈడీ అధికారులు.. ఎన్నారై ఆస్పత్రిలో 2016 నుంచి అన్ని రికార్డులను పరిశీలిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2020, 2021 సంవత్సరాలలో ఆసుపత్రిలో కోవిడ్ -19 కోసం చికిత్స పొందిన 1,000 మందికి పైగా రోగుల వివరాలను ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నమోదు చేయలేదని శుక్రవారం సోదాల సందర్భంగా ఈడీ అధికారులు కనుగొన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చినకాకాని గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి కొత్త బ్లాక్‌ నిర్మాణానికి రూ. 43 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించకముందే చెల్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

click me!