
నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి చేరికపై మంత్రి అఖిలప్రియ ధిక్కార స్వరం వినిపిస్తోందా? టిడిపిలోకి గంగుల చేరికపై అఖిల చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. చంద్రబాబు సమక్షంలో అటు గంగుల పార్టీలో చేరిన సమయంలోనే ఇటు అఖిల చేసిన వ్యాఖ్యలపై పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఎందుకంటే, గంగుల పార్టీలో చేరటాన్ని అఖిల తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విషయమై మంత్రి మీడియాతో మంత్రి మాట్లాడుతూ,‘ మా వర్గం మాది...వాళ్ళ వర్గం వాళ్ళది’ అంటూ ఘాటు వ్యాఖ్యలే చేసారు. అంతేనా ఇంకా చాలానే మాట్లాడారు.
చంద్రబాబేమో ఉపఎన్నిక సమయంలో ఓ పెద్ద రెడ్డి కుటుంబం టిడిపిలో చేరిందనిపించుకోవాలనే గంగుల కుటుంబాన్ని చేర్చుకున్నారు. అయితే, మంత్రి మాటలు మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని ధిక్కరించేదిగానే అనిపిస్తోంది. ‘గంగుల చేరిక వల్ల భూమా కుటుంబానికి ఎటువంటి లాభ, నష్టాలు లేవ’న్నారు.
‘నాలుగు రోజుల్లో పోలింగ్ ఉండగా ఇపుడు గంగుల వచ్చి చేసేదేముంటుంద’ని మంత్రి సంధించిన ప్రశ్నకు చంద్రబాబే సమాధానం చెప్పాలి. పైగా ‘భూమా బ్రహ్మానందరెడ్డి విజయానికి గంగుల మద్దతుంటుందని కూడా తాను అనుకోవటం లేద’ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఉపఎన్నికలో టిడిపిని గెలిపించేందుకైతే పార్టీలోకి గంగుల ఎప్పుడో వచ్చే వారని కానీ ఇపుడు చేరుతున్నారంటేనే కేవలం వ్యక్తిగతం కోసమే అని కూడా మంత్రి ఎద్దేవా చేసారు. ‘అసలు ఈ ఎన్నికకు గంగుల చేరికకు ఎటువంటి సంబంధం లేద’ని కూడా తేల్చేసారు.
ఒకే పార్టీలో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉంటామని అఖిలప్రియ చెప్పటం కొసమెరుపు. మొత్తానికి గంగుల చేరికపై మంత్రి అఖిలప్రియ తన అసంతృప్తిని బాహాటంగానే చెప్పేయటం ఆశ్చర్యంగావుంది.