వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వం దేనికైనా సిద్దమే.. మంత్రి ఆదిమూలపు సురేష్

By Sumanth KanukulaFirst Published Oct 9, 2022, 12:01 PM IST
Highlights

వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్దమని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతమవుతుందని చెప్పారు.

వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్దమని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతమవుతుందని చెప్పారు. వికేంద్రీకరణ అనేది ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. రాజధాని విషయంలో రైతులను టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లుగా వారు పాదయాత్ర చేస్తున్నారని విమర్వించారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ కౌలు ఇస్తున్నామని, రైతులు తమ ప్రభుత్వం చేసిన తప్పేంటో చెప్పాలని అన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా ల్యాండ్ పూలింగ్ చేయడం వల్లే ఇబ్బందులు అని అన్నారు. 

సీఎం జగన్ తీసుకొచ్చిన వికేంద్రీకరణ పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఆమోదించారని అన్నారు. వికేంద్రీకరణ సీరియస్‌నెస్ చెప్పడానికే ఓ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉండవచ్చని అన్నారు. వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్దంగా ఉందన్నారు. ఓ ప్రాంతం సెంటిమెంట్ కోసం పెట్టిన పార్టీ టీఆర్ఎస్ అని అన్న ఆదిమూలపు సురేష్.. ఇప్పుడు వాళ్లు దేశమంతా పోటీ చేస్తామంటే అది వారిష్టమని చెప్పారు. 

Also Read: విశాఖ రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడం లేదు.. అది జగన్ ఆడుతున్న డ్రామా: హర్ష కుమార్

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి నుంచి అరసవల్లి వరకు ఆ ప్రాంత రైతుల పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న తరుణంలో.. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో మేధావులు, వివిధ ప్రజాసంఘాలతో కూడిన నాన్ పొలిటికల్ జేఏసీ శనివారం ఏర్పాటైంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 15న రెండు లక్షల మందితో భారీ ర్యాలీ, ‘విశాఖ గర్జన’ నిర్వహించాలని జేఏసీ ప్రతిపాదించింది. సీఎం జగన్ తలపెట్టిన మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో జేఏసీ తీర్మానించింది.

అంబేద్కర్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతి రాయ్ ఈ నాన్ పొలిటికల్ జేఏసీకి కన్వీనర్‌గా ఉన్నారు. విశాఖలో ర్యాలీని భారీ స్థాయిలో విజయవంతం చేసేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయిలో వరుస సమావేశాలు నిర్వహించాలని జేఏసీ సభ్యులు నిర్ణయించారు. 

ఉత్తరాంధ్రలోని మెజారిటీ ప్రజలు మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా లేరన్న అభిప్రాయాన్ని తొలగించడమే తమ లక్ష్యమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. బలమైన ప్రతిఘటన లేని పక్షంలో రైతుల పాదయాత్రకు మరింత మద్దతు, బలం చేకూరే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తర ఆంధ్ర ప్రజల వారి అభిప్రాయాలను వెల్లడించేలా జేఏసీ భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసింది. 

ఇదిలా ఉంటే.. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానుల కోసం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్‌కు అందజేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. తాము కూడా అమరావతికి వ్యతిరేకమేనని కరణం ధర్మశ్రీ అన్నారు. వికేంద్రీకరణ కోసం తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. దమ్ముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు సవాలు విసిరారు. అమరావతికి మద్దతు నినాదంతో టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని అన్నారు. అచ్చెన్నాయుడుపై పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా వెల్లడించారు. 

click me!