
ప్రకాశం: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వమని సీఎం జగనే చెప్పారని తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. దోషులు ఎవరైనా బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఇది జరిగిన 48 గంట్లలోనే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందులలోని వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసానికి రెండు వాహనాల్లో చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆయన కుటుంబ సభ్యులకు అరెస్ట్ మెమో అందజేశారు. భాస్కర్ రెడ్డిని ఐపీసీ 302, 120 (బి), 201 సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నాయి.. బీటెక్ రవి
అనంతరం భాస్కర్ రెడ్డిని కట్టుదిట్టమైన భద్రత మధ్య సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు హైదరాబాద్‌కు తరలించేందుకు సీబీఐ అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రంలోపు భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక, భాస్కర్‌రెడ్డి అరెస్ట్ వార్త తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు.
వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన వెంటనే పులివెందులలో దుకాణాలను మూసివేశారు.