
పిఠాపురం : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనుంది... దీంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ కోసం మెగా కుటుంబం కూడా పిఠాపురం బాట పట్టింది. ఇప్పటికే నాగబాబు, ఆయన సతీమణి, కొడుకు పవన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు పెద్దన్న చిరంజీవి కుటుంబం కూడా పవన్ కోసం రంగంలోకి దిగింది. చిరంజీవి సతీమణి సురేఖ, తనయుడు రాంచరణ్ తేజ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రాజమండికి చేరుకున్నారు తల్లికొడుకులు అక్కడినుండి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకున్నారు. ముందుగా కుకుటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. సురేఖ, రాంచరణ్ తో పాటు అల్లు అరవింద్ కూడా పిఠాపురంలో పర్యటిస్తున్నారు.
బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం వచ్చిన గ్లోబల్ స్టార్ రాంచరణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన హీరోను చూడగానే వారు కంట్రోల్ తప్పిపోయారు... ఆయనను మరింత దగ్గరినుండి చూసేందుకు, కుదిరితే కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. ఇలా రాంచరణ్ కోసం ఎగబడుతున్న అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాగోలా రాంచరణ్ ను అభిమానుల మధ్యనుండి తీసుకెళ్లగలిగారు పోలీసులు.