
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి. ముగ్గురు , నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్‌లో ప్రస్తుతం వున్న నలుగురు మంత్రులను తప్పిస్తారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎమ్మెల్సీలని చేసి నలుగురు కొత్త ఎమ్మెల్సీలకు మంత్రి పదవులను ఇచ్చే ఆలోచనలో వున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించి మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా.. గతేడాది వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన సంగతి తెలిసిందే .11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఈ అసంతృప్త నేతలు అధికార పార్టీని చికాకు పెడుతూనే వున్నారు.
ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌కు మంత్రులుగా వున్నారు.