రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రైవేట్ క్లినిక్‌లో చెలరేగిన మంటలు.. డాక్టర్‌తో పాటు ఇద్దరు చిన్నారులు మృతి

By Sumanth KanukulaFirst Published Sep 25, 2022, 9:20 AM IST
Highlights

తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వివరాలు.. రేణిగుంట భగత్ సింగ్ కాలనీలోని కార్తీక చిన్న పిల్లల క్లినిక్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అదే అపార్ట్‌మెంట్‌లో పై అంతస్తుల్లో ఉన్న డాక్టర్ రవిశంకర్‌ రెడ్డి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  

మంటల్లో చిక్కుకున్న రవిశంకర్ రెడ్డి భార్య, అత్త, ఇద్దరు పిల్లలను సహాయక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. మరో గదిలో నిద్రిస్తున్న రవిశంకర్‌రెడ్డి చుట్టూ మంటలు దట్టంగా అలముకోవడంతో ఆయన సజీవదహనమయ్యారు. ఆయనను బయటకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

మరోవైపు అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చిన రవిశంకర్ రెడ్డి పిల్లలు కార్తీక, భరత్‌లు దట్టమైన పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో కార్తీక, భరత్‌లు మృతి చెందారు. 

ఇక, ఘటన స్థలంలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం  జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ క్లినిక్‌లో కేవలం ఔట్ పేషెంట్ సేవలు అందిస్తుండటంతో.. పెను ప్రమాదం తప్పింది. 

click me!