"నేను నష్టజాతకురాలిని, మీరు వేరే పెళ్లిచేసుకోండి"..భర్తకు లేఖ రాసి భార్య ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 10:30 AM IST
Highlights

చిన్నప్పటి నుంచి తను చూసిన సంఘటనలు, ఎదుర్కొన్న కష్టాలు అన్ని తన జాతకం వల్లేనని నమ్మిన ఓ వివాహిత.. మనస్తాపానికి గురై తన వల్ల భర్తకు ఎలాంటి కష్టాలు రాకూడదని  ఆత్మహత్యకు పాల్పడింది. 

చిన్నప్పటి నుంచి తను చూసిన సంఘటనలు, ఎదుర్కొన్న కష్టాలు అన్ని తన జాతకం వల్లేనని నమ్మిన ఓ వివాహిత.. మనస్తాపానికి గురై తన వల్ల భర్తకు ఎలాంటి కష్టాలు రాకూడదని ఆత్మహత్యకు పాల్పడింది.

నందిగాం మండలం తురకలకోటకు చెందిన నవ్యకు, ఆమె సమీప బంధువైన వీరగున్నమ్మపురానికి చెందిన ధనరాజుతో ఈ ఏడాది జూలైలో వివాహమైంది. ధనరాజు కులిపనులకు వెళుతూ... భార్యను, తల్లిని పోషిస్తున్నాడు. వివాహం జరిగాక భార్యను చదివించాలని భావించిన ధనరాజు ఆమెను డిగ్రీలో చేర్పించాడు. ఈ క్రమంలో నవ్య కళాశాలకు వెళుతూ ఉండేది..

అయితే సోమవారం అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ధనరాజు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటికి తిరిగివచ్చాడు. లోపల భార్య ఉరేసుకుని కనిపించడంతో తల్లి, కొడుకులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో లేఖలో పేర్కొంది.

‘‘నేను నష్టజాతకురాలిని.. చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్నవారికి కష్టాలే.. అమ్మానాన్నల మధ్య గొడవలు మొదలయ్యాయి. పుష్పావతి అయ్యాక మా నాన్న చనిపోయాడు. పెళ్లయిన కొద్దిరోజులకు మీరు కుక్కకాటుకు గురైయ్యారు. ఇలా నేనున్న చోట నా వాళ్లకు కీడు జరుగుతుంది. అందుకే నా వల్ల ఎవరికి ఏ కీడు జరగకూడదని.. నేను ఎవరికీ భారం కాకూడదని చనిపోతున్నాను.. నన్ను మరచిపోయి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి’’ అంటూ నవ్య తన భర్తకు తెలిపింది. 

నవ్య మరణవార్త గ్రామంలో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

click me!